
ట్రంప్ ఎన్నికల సభలో.. కరోనా కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర కరోలినాలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్‌ఎన్‌సీ) ఎన్నికల సభలో పాల్గొన్న నలుగురికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. ఇక్కడి మెక్లెన్‌బర్గ్ కౌంటీలోని ఛార్లొట్టె పట్టణంలో ఆగస్టు 24 నుంచి 27 వరకు ఈ సమావేశం జరిగింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా డొనాల్డ్ ట్రంప్, మైక్ పెన్స్‌లను అధికారికంగా ఎన్నుకొనేందుకు ఏర్పాటైన ఈ సమావేశంలో.. 300 మందికి పైగా పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశం తొలిరోజు.. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పాల్గొని ప్రసంగించటం గమనార్హం.
ఈ సమావేశంలో పాల్గొన్న వారికి, సిబ్బందికి కలిపి మొత్తం 792 కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వెలువడిన ఫలితాల్లో పాల్గొన్న వారిలో ఇద్దరికి.. మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకినట్టు తెలిసిందని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వీరిని వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించి, వారి సమీపానికి వచ్చిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో పలువురు మాస్కులు ధరించకపోవటం పట్ల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాస్కులు వేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచనలు చేసినప్పటికీ.. వారిలో కొందరు మాత్రమే ఈ మార్గదర్శకాలను పాటించినట్టు సంబంధిత వీడియోల ద్వారా తెలుస్తోంది.
మెక్లెన్‌బర్గ్ కౌంటీలోని అతిపెద్ద నగరమైన ఛార్లొట్టెలో ఇప్పటికే 25,000 కొవిడ్ కేసులు నమోదు కావటం గమనార్హం. ఇదిలా ఉండగా.. శ్వేత సౌధంలో గురువారం రాత్రి ట్రంప్ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ అంగీకార ప్రసంగం చేశారు. 1000 మందికి పైగా పాల్గొన్న సమావేశంలో కూడా ట్రంప్‌తో సహా పలువురు మాస్కులు ధరించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.