ఫ్రాన్స్‌లో యువతికి శిరోముండనం!

ఫ్రాన్స్‌లోనూ శిరోముండనం కేసు నమోదయ్యింది. వేరే దేశానికి చెందిన యువకున్ని ప్రేమించినందుకు ఓ మైనర్‌ అమ్మాయికి సొంత కుటుంబీకులే శిరోముండనం చేశారు.

Published : 26 Oct 2020 00:49 IST

నిందితులకు దేశ బహిష్కరణ

పారిస్‌: ఫ్రాన్స్‌లోనూ శిరోముండనం కేసు నమోదయ్యింది. వేరే దేశానికి చెందిన యువకున్ని ప్రేమించినందుకు ఓ మైనర్‌ అమ్మాయికి కుటుంబీకులే శిరోముండనం చేశారు. దీన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణించింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులతోపాటు మొత్తం ఐదుగురు నిందితులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

బోస్నియా దేశానికి చెందిన ఓ కుటుంబం ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌ నగరంలో గత రెండు సంవత్సరాలుగా నివాసముంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఓ 17ఏళ్ల మైనర్‌ యువతి అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి చెందిన 20ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ఇద్దరూ వేరువేరు మతాలకు చెందినవారు అయినప్పటికీ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. చివరకు ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో యువతిని శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో అమ్మాయి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా యువతికి సొంత కుటుంబీకులే గుండు గీయించారు. ఈ విషయాన్ని ఆగస్టు నెలలో ఫ్రెంచ్‌ మీడియా బయటపెట్టింది. అక్కడి ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. సెర్బియాకు చెందిన మరో మతస్తుడిని ప్రేమించిందనే కారణంతో అమ్మాయిని తీవ్రంగా కొట్టడం, శిరోముండనం చేయడం వంటి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టంచేసింది. విచారణలో భాగంగా అమ్మాయి తల్లిదండ్రులతోపాటు మరో ముగ్గురు సమీప బందువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు గుర్తించింది. అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా వీరిని బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు తరలించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాలశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

మైనర్‌ యువతిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా శిరోముండనం చేసిన కేసు ఫ్రాన్స్‌లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ మైనర్‌ అమ్మాయి బాధ్యతలను స్థానిక సామాజిక సేవా సంస్థ చూసుకుంటుందని.. మేజర్‌ ఐన తర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కు ఈ అమ్మాయి పొందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉంటే, బోస్నియా, సెర్బియా దేశాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. 1990 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని