ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌కు కరోనా

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అక్కడి అధ్యక్ష భవనం ఎలీసీ ప్యాలెస్‌ వెల్లడించింది. కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా కన్పించడంతో మేక్రాన్‌ వైరస్‌ పరీక్షలు చేయించుకున్నారని,

Updated : 17 Dec 2020 15:55 IST

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అక్కడి అధ్యక్ష భవనం ఎలీసీ ప్యాలెస్‌ వెల్లడించింది. కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా కన్పించడంతో మేక్రాన్‌ వైరస్‌ పరీక్షలు చేయించుకున్నారని, గురువారం ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్యాలెస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఎలాంటి లక్షణాలు కన్పించాయో ప్యాలెస్‌ వెల్లడించలేదు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అధ్యక్షుడు ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని, అక్కడి నుంచే విధులు నిర్వహిస్తారని తెలిపింది. కాగా.. మేక్రాన్‌.. బుధవారం పోర్చుగీస్‌ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టాతో సమావేశమయ్యారు. 

ఇప్పటికే పలువురు దేశాధినేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తదితరులు కొవిడ్‌ను జయించారు. కాగా.. ఆ మధ్య ఫ్రాన్స్‌లో కరోనా రెండో దఫా విజృంభించడంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. ఇటీవలే ఈ నిబంధనలను కాస్త సడలించారు. అయితే రాత్రిపూట కర్ఫ్యూతో పాటు రెస్టారంట్లు, కేఫ్‌లు, సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతోంది. 

ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 59000లకు పైగా కొవిడ్‌కు బలయ్యారు. బుధవారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 17వేలకు పైగా కేసులు నమోదవడం గమనార్హం. క్రిస్మస్‌ సమీపిస్తున్న తరుణంలో కేసులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీకి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏడాది చివరి నాటికి 10లక్షల టీకాలు దేశానికి రానున్నట్లు ఆ దేశ ప్రధాని జీన్‌ క్యాస్టెక్స్‌ తెలిపారు. 

ఇవీ చదవండి..

ఫైజర్‌ టీకాతో అలెర్జీ

ప్రపంచం ఇంకా వణుకుతోంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని