
ముంబయి రోడ్లపై ఫ్రెంచ్ అధ్యక్షుడి పోస్టర్ల కలకలం
ముంబయి: జన సంచారంతో నిత్యం రద్దీగా ఉండే ముంబయి రహదారులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ పోస్టర్లు అతికించడం కలకలం సృష్టించింది. దక్షిణ ముంబయిలోని బెండీ బజార్ ప్రాంతంలో వందలాది పోస్టర్లు అతికించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మహ్మద్ అలీ రోడ్‌లోని జేజే ఫ్లైఓవర్ కింద వీటిని అతికించగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తొలగించారు. ఫ్రాన్స్‌లోని ఓ పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై ప్రచురితమైన కార్టూన్లను సమర్థించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్‌పై ముస్లిం దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబయిలో ఆయన పోస్టర్లను రహదారిపై అతికించారు. అయితే, ముంబయి రోడ్డుపై మెక్రాన్ పోస్టర్ల పైనుంచి వాహనాలు వెళ్తున్నట్టు రికార్డు అయిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.