
గేట్ రాసే అభ్యర్థులకు రేపే ఆఖరి ఛాన్స్!
ముంబయి: ఐఐటీలో మాస్టర్స్ ప్రొగ్రామ్స్‌తో పాటు ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అర్హతకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష రాసే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సిటీని మార్చుకొనేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (GOAPS) పోర్టల్‌ను తెరిచి పరీక్ష కేంద్రాన్ని మార్చుకొనేందుకు ఐఐటీ బాంబే అధికారులు వీలు కల్పించారు. అయితే, అందుకు ఇదే చివరి ఛాన్స్ అని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష రాసే సిటీని gate.iitb.ac.inలో మార్పులు చేసుకోవచ్చని తెలిపారు.
పరీక్ష రాసే నగరాన్ని మార్చుకొనేందుకు మరో అవకాశం కల్పించాలంటూ గేట్ 2021 కమిటీకి విజ్ఞాపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితులు, ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఆన్‌లైన్ పోర్టల్ GOAPS మళ్లీ తెరిచేందుకు గేట్ 2021 కమిటీ నిర్ణయించిందని తెలిపింది. ఈ అవకాశం డిసెంబర్ 14, 15 తేదీల వరకే ఉంటుందని స్పష్టంచేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేసుకొనేందుకు అవకాశం ఉండదని తెలిపారు. 2021 ఫిబ్రవరి 5 నుంచి 7, 12 నుంచి 14 తేదీల మధ్య గేట్ 2021 పరీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన రెండు సబ్జెక్టులతో పాటు మొత్తంగా 27 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగింది. గతేడాది గేట్ పరీక్షకు 8.59 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 8,82,684 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.