భయపెడుతున్న మంచుదిబ్బ!

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుదిబ్బ(ఐస్‌బర్గ్‌) అట్లాంటిక్‌ మహాసముద్రంలో తెలియాడుతూ ఉంది. దీనికి ఏ68ఏగా నామకరణం చేశారు. 2017 నుంచి సముద్ర అలల కారణంగా ఇది నెమ్మదిగా దక్షిణ అట్లాంటిక్‌ ప్రాంతంలోకి ప్రవహించింది..........

Published : 29 Dec 2020 12:36 IST

అంటార్కిటికా నుంచి కదలివస్తున్న ఐస్‌బర్గ్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోనే అతిపెద్ద మంచుదిబ్బ(ఐస్‌బర్గ్‌) అట్లాంటిక్‌ మహాసముద్రంలో తెలియాడుతూ ఉంది. దీనికి ఏ68ఏగా నామకరణం చేశారు. 2017 నుంచి సముద్ర అలల కారణంగా ఇది నెమ్మదిగా దక్షిణ అట్లాంటిక్‌ ప్రాంతంలోకి ప్రవహించింది. ప్రస్తుతం ఇది దక్షిణ జార్జియాకు చెందిన సబ్‌-అంటార్కిటిక్‌ ద్వీపం దిశగా వెళ్తోంది. అక్కడ ఉండే జంతుజాలంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనికి మళ్లీ పగుళ్లు...

ఈ ఏ68ఏ పరిమాణం దాదాపు 2,600 చ.కి.మీ. ఉందని పరిశోధకులు తేల్చారు. 2017, జులైలో అంటార్కిటికాలో ఉన్న లార్సెన్‌ సీ అనే ఐస్‌ షెల్ఫ్‌ నుంచి ఇది విడిపోయింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఇది బ్రిటన్‌ అధీనంలో ఉండే దక్షిణ జార్జియా ద్వీపం దిశగా పయనిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ మంచుదిబ్బలో మరిన్ని పగుళ్లు ఏర్పడి చిన్న చిన్న దిబ్బలుగా విడిపోతున్నట్లు గుర్తించారు. ఇవి కూడా భారీ పరిమాణంలో ఉన్నట్లు తేలింది. వీటికి ఏ68ఈ, ఏ68ఎఫ్‌గా నామకరణం చేశారు.

ప్రమాదం ఏంటంటే..

ఒకవేళ ఇది ద్వీపానికి సమీపంలోనే నిలిచిపోతే, అక్కడి జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏ68ఏ దిబ్బపై బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే(బీఏఎస్‌)కు చెందిన పర్యావరణవేత్తలు వచ్చే నెల నుంచి అధ్యయనం ప్రారంభించనున్నారు. ఒకవేళ ఊహిస్తున్నట్లుగా దక్షిణ జార్జియా ద్వీపానికి సమీపంలో నిలిచిపోతే అక్కడ ఉండే పెంగ్విన్‌, సీల్‌ వంటి సముద్ర జంతువులు ఆహారం కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.

మంచి కూడా ఉంది..

అయితే, ఈ మంచుదిబ్బ వల్ల కొన్ని లాభాలూ ఉన్నాయంటున్నారు పరిశోధకులు. లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిలిచిపోతే.. దీనిపై ఉండే దుమ్ముధూళి.. సముద్రపు ప్లాంక్‌టన్‌ను ఎరువుగా మారుస్తుందని తెలిపారు. ఈ ప్రక్రియ వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉపయోగించుకుంటుందని వివరించారు. అయితే, ఇలా మంచుదిబ్బలు ముక్కలుగా విడిపోవడానికి వాతావరణ మార్పులు కారణమేమీ కాదని.. ఇది ఒక సహజ ప్రక్రియ అని బీఏఎస్‌ పరిశోధకులు తెలిపారు. అయితే, ఇలాంటి ఘటనలు అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని సూచిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తుల్లో మరిన్ని పగుళ్లు ఏర్పడి మంచుదిబ్బలుగా విడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ఇవీ చదవండి..

భారత్‌లోకి కరోనా ‘కొత్త రకం’

ఈ ఏటి మేటి స్మార్ట్‌వాచ్‌లివే..!


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని