
మమతాజీ.. రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ?
పశ్చిమబెంగాల్ సీఎంకు గవర్నర్ లేఖ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మధ్య మరోసారి విభేదాలు రాజుకుంటున్నాయి. ఇటీవల గవర్నర్ అసెంబ్లీకి వెళ్లిన సమయంలో గేటు తాళాలు వేసి ఉండటంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి గవర్నర్ లేఖ రాయడం చర్చకు తావిస్తోంది. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమిట్ ద్వారా సేకరించామని చెబుతున్న రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారో తెలపాల్సిందిగా కోరుతూ గవర్నర్ సీఎంకు లేఖ రాశారు.
దీనిపై ఇప్పటికే తాను వివరణ కోరగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగానీ, సంబంధిత అధికారులుగానీ స్పందించలేదని ధనకర్ తన లేఖలో పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 1న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఈ మేరకు పెట్టుబడులు రాబట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రసంగంలో పొందుపరిచిన దానికీ, వాస్తవ పరిస్థితులకీ చాలా తేడా ఉందని గవర్నర్ ఆరోపించారు. ఈ సందర్భంగా అప్పట్లో గవర్నర్ ప్రసంగంలోని వాక్యాలను ఆయన ఉటంకించారు.
‘‘రాష్ట్రానికి దాదాపు రూ. 12 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని, దీనిలో 2019, ఫిబ్రవరి 1 నాటికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పనులు కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పారు. దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టారు?అసలు ఆడిట్ నిర్వహిస్తున్నారా? ప్రజలకు ప్రతీ విషయం తెలియాల్సిన అవసరం ఉంది కదా.’’ అని గవర్నర్ తన లేఖలో ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన తర్వాతి రోజునే గవర్నర్ ఇలా లేఖ రాయడం గమనార్హం.