
ముఫ్తీ గృహనిర్భందం మరో 3 నెలలు పొడిగింపు
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మోహబూబా ముఫ్తీ గృహ నిర్భంధాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. ఆమె గృహనిర్భంధం గడువు ఆగస్టు 5తో ముగియనుండటంతో తాజాగా దానిని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె అధికారిక నివాసం ఫెయిర్‌వ్యూ బంగ్లాను సబ్సిడరీ జైలుగా కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పీడీపీ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ధ్రువీకరించింది. అయితే భద్రతా సంస్థల సూచన మేరకే ముఫ్తీ గృహనిర్భంధాన్ని పొడిగించినట్లు సమాచారం.
గతేడాది ఆగస్టు 5న జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్య కింద పలువురు రాజకీయ నాయకులను గృహనిర్భంధం చేశారు. సెప్టెంబరులో కేంద్రం ఫరూఖ్ అబ్దుల్లా, మోహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై కేంద్రం కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) అమలు చేసింది. అయితే ఒమర్ అబ్దుల్లాతో పాటు ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లాను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. తాజాగా శుక్రవారం పీపుల్స్ కాన్ఫరెన్స్ లీడర్ సజాద్ లోన్ కూడా గృహనిర్భంధం నుంచి విముక్తి కలిగించింది. ‘సరిగ్గా ఏడాది కాలానికి ఐదు రోజుల ముందు నాకు విముక్తి లభించింది’ అని ఆయన ట్వీట్ చేశారు. పీఎస్‌ఏ కింద ముఫ్తీ గృహ నిర్భంధం పొడిగించడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.