జేఈఈ, నీట్‌ వాయిదాకే మద్దతు: గ్రెటా థన్‌బర్గ్‌

సెప్టెంబర్‌లో జరగబోయే జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. దీనికి తాజాగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు.

Published : 25 Aug 2020 15:59 IST

దిల్లీ: సెప్టెంబర్‌లో జరగబోయే జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. దీనికి తాజాగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు. కరోనావైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో భారత్‌లో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. అంతేకాకుండా దేశంలో తీవ్ర వరదల ప్రభావానికి లక్షల మంది లోనయ్యారని అన్నారు. ఈ సందర్భంలో జేఈఈ నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నట్లు గ్రెటా థన్‌బర్గ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఇక దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా  జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. అంతేకాకుండా భాజపా సీనియర్‌ నేత సుబ్రమణియన్‌ స్వామి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, దేశ వ్యాప్తంగా నీట్‌, జేఈఈ-మెయిన్‌లను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లోనే వాటిని నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని విచారణ సమయంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కోర్టుకు తెలిపింది. ‘‘విద్యార్థుల కెరియర్‌ను ఎక్కువకాలం ప్రమాదంలో ఉంచలేం’’ అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబర్‌లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని