థియేటర్లకు అనుమతి

దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల..........

Published : 01 Oct 2020 01:09 IST

దిల్లీ: దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టింది. క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరిచే వెసులుబాటు కల్పించింది. వినోద పార్కులు, సంబంధిత స్థలాలు మూసి ఉంచాలని స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం పేర్కొంది.

తాజా మార్గదర్శకాల్లో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని కేంద్రం ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు దశలవారీగా తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చంది. అయితే, పిల్లల్ని పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విద్యా విభాగాలకు విడిచి పెట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.

కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల 100 మందితో రాజకీయ, సాంస్కృతికి, మతపరమైన తదితర సమావేశాలను నిర్వహించుకోవచ్చని కేంద్రం పేర్కొంది. 100 మందికి పైగా సమావేశాలకు అనుమతిచ్చే అంశాన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. అంతర్జాతీయ విమానయాన ప్రయాణాలకు అనుమతి లేదని (హోంశాఖ అనుమతిచ్చినవి మినహా) కేంద్రం స్పష్టంచేసింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి స్థానిక లాక్‌డౌన్లు విధించకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రాల పరిధిలో గానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై గానీ ఎలాంటి ఆంక్షలు విధించొద్దని, ప్రయాణానికి ప్రత్యేకంగా ఎలాంటి పాసులూ అవసరం లేదని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని