Published : 10 Sep 2020 09:22 IST

నిందితులతో స్నేహం.. విచారణలో వినూత్న విధానం

నిందితుల నుంచి నిజాలు రాబట్టడం అంత సులువేమీ కాదు. అందుకే వారి నుంచి నిజం రాబట్టేలా పోలీసులు, సైన్యానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంత అడిగినా నిజం చెప్పని వారిపై అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారు. అంటే తీవ్రంగా హింసిస్తారు. ఆ నొప్పి భరించలేక అయినా నిజం చెబుతారని విచారణ జరిపే అధికారుల అభిప్రాయం. అయితే ఇలా హింసించకుండా మరో విధానం కూడా ఉంది. అదే, నిందితులతో ప్రేమగా మాట్లాడి.. వారిని స్నేహితులుగా మార్చుకొని నిజం రాబట్టడం. చాలా సినిమాల్లో మనం ఇలాంటి పద్ధతిని చూశాం. అయితే నిందితులను దండించి కాదు, ప్రేమగా మాట్లాడి నిజం తెలుసుకోవాలన్న ఈ పద్ధతిని నిజ జీవితంలో ప్రారంభించింది మాత్రం జర్మనీకి చెందిన హన్స్‌ షార్ఫ్‌ అనే విచారణ అధికారి. 

హన్స్‌ షార్ఫ్‌.. ప్రస్తుత పొలాండ్‌లోని రాస్టెన్‌బర్గ్‌లో 1907లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఆర్మీ అధికారి. వారి కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టెక్ట్స్‌టైల్‌ సంస్థ ఉంది. కుటుంబ వ్యాపారాన్ని చూసుకునే క్రమంలో కస్టమర్లను ఆకట్టుకునేలా మాట్లాడటం హన్స్‌కు అలవాటైంది. తన మాటకారితనంతో సంస్థను మరింత అభివృద్ధి చేశాడు. దక్షిణాఫ్రికాలో ఉన్న శాఖని చూసుకునే హన్స్‌.. సరిగ్గా రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమవుతున్న సమయం (1939)లో జర్మనీకి వచ్చాడు. యుద్ధం నేపథ్యంలో జర్మనీ పౌరుడిగా అతడు సైన్యంలో చేరాడు. అయితే అతడి భార్య భయపడింది. సైన్యంలో ఉండే కన్నా.. హన్స్‌కి ఇంగ్లిష్‌ వచ్చు కాబట్టి అతడికి ఆఫీస్‌లో చేసే పని అప్పగించాల్సిందిగా అధికారులను కోరింది. కొన్నాళ్లకు అతడు విస్బడెన్‌కు బదిలీ అయ్యాడు. అయితే హన్స్‌ ఇంగ్లిష్‌ మాట్లాడే విధానం అక్కడి అధికారుల్ని బాగా ఆకట్టుకుంది. దీంతో అతడిని ఇంటెలిజెన్స్‌ విభాగంలో విచారణ అధికారులకు సహాయకుడిగా నియమించారు.

ఆ సమయంలో యుద్ధభూమిలో పట్టుబడ్డ శత్రు సైనికులను రహస్యాలు చెప్పాలంటూ విచారణ అధికారులు చిత్రహింసలు పెట్టేవాళ్లు. అది హన్స్‌ షార్ఫ్‌కు నచ్చలేదు. మనిషిని అంత దారుణంగా హింసించడం అతడిని బాధించింది. అప్పుడే హన్స్‌.. తను విచారణ అధికారిగా మారితే ఇలాంటి పరిస్థితులను మార్చేయాలని, యుద్ధఖైదీలను హింసించకుండా రహస్యాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అతడి కోరిక తొందరగానే నెరవేరింది. 1943లో జర్మనీకి చెందిన ఓ విమానాన్ని శత్రువులు కూల్చి, పైలట్లను చంపారట. ఈ ఘటనలో పట్టుబడ్డ యూఎస్‌ వైమానిక దళాన్ని విచారించే పనిని అధికారులు హన్స్‌కు అప్పగించారు. 

యుద్ధఖైదీలను హన్స్‌ ఐసోలేటెడ్‌ గదుల్లో ఉంచాడు. వారి గురించి ఏం తెలియకున్నా.. తెలిసినట్లుగా ప్రవర్తించాడు. నిజం చెబితే వదిలేస్తామని లేకపోతే క్రూరమైన విచారణ పోలీసు దళానికి అప్పగిస్తామని హన్స్‌ వారిని భయపెట్టాడు. ఆ తర్వాత వారితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వారికి మంచి భోజనం పెట్టించి, జైలులోనే నడకకు అనుమతి ఇప్పించాడు. స్థానిక జంతు ప్రదర్శనకు తీసుకెళ్లి వారితో సరదాగా సమయం గడిపేవాడు. అంతేకాదు.. యుద్ధ ఖైదీలు తమకు విమానం నడపాలుందని కోరిక వెలిబుచ్చితే దాన్ని తీర్చేశాడు హన్స్‌. అలా ఖైదీలు అతడితో స్నేహం మాయలో వారికి తెలియకుండా తమకు తెలిసిన రహస్యాలను చెప్పేశారు. 

హన్స్‌ విచారణ జరిపే టెక్నిక్‌ గురించి తెలుసుకున్న అమెరికా విచారణ విభాగం తమ దేశానికి రావాలని 1948లో ఆహ్వానించింది. విచారణ సమయంలో హన్స్‌ అవలంబించే పద్ధతులు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ను ఆకట్టుకున్నాయి. అధికారులు అతడికి అమెరికా పౌరసత్వంతో సత్కరించారు. దీంతో హన్స్‌ అక్కడే ఉండిపోయాడు. హన్స్‌ టెక్నిక్‌గా పిలిచే ఈ పద్ధతిలో ముఖ్యంగా నాలుగు వ్యూహాలు ఉంటాయి. 1) ఖైదీకి స్నేహితుడిగా మారాలి. 2) వారిని రహస్యాలు చెప్పాలని ఒత్తిడి చేయకుండా వారి మనసులో ఉన్నది మాట్లాడనివ్వాలి. 3) ఖైదీ గురించి, అతడి వద్ద ఉన్న రహస్యాలన్నీ తెలుసన్నట్లుగా ప్రవర్తించాలి. 4) దానిని నిర్థారించుకునే ప్రయత్నం చేయాలి. హన్స్‌ పాటించిన ఈ పద్ధతినే యూఎస్‌ పోలీసుల శిక్షణలో విచారణ పాఠంగా ఇప్పటికీ చెబుతున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని