ఎవరి మృతదేహాన్ని ఖననం చేశారో చెప్పండి..

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్స పొందుతూ..

Published : 03 Oct 2020 18:39 IST

మాకు ఆమెను చూపించలేదు

సిట్, సీబీఐ మీద నమ్మకం లేదన్న బాధితురాలి కుటుంబసభ్యులు

 

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్స పొందుతూ యువతి మృతిచెందిన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు రెండురోజులుగా గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే ఈ రోజు మీడియాను అనుమతించగా యువతి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేశారు. ‘నా కూతురిని చూపించాలని ప్రాధేయపడినా ఎవరూ కనికరం చూపలేదు. సీబీఐ దర్యాప్తు కూడా మాకు అక్కర్లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఏర్పాటైన బృందం కేసు దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం’ అని అన్నారు. ఎలాంటి అబద్ధాలు ఆడటం లేదని, నార్కో పరీక్షలకు హాజరుకాబోమని ఆమె స్పష్టం చేశారు.

బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలీసులు ఎవరి మృతదేహాన్ని ఖననం చేశారో ముందుగా స్పష్టం చేయాలి. మాకు ఆమెను చూపించలేదు’ అని వెల్లడించారు. ‘మేమెందుకు నార్కో పరీక్షలకు హాజరుకావాలి. మేము నిజమే చెబుతున్నాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. అబద్ధాలు మాట్లాడుతున్న జిల్లా మెజిస్ట్రేట్‌, ఎస్పీ నార్కో పరీక్షలకు హాజరుకావాలి’ అని డిమాండ్‌ చేశారు. బాధితురాలి అంతిమసంస్కారాల సమయంలో ఆమె తాతయ్య అక్కడే ఉన్నారు అనే ఆరోపణలను ఆమె కొట్టివేశారు. యువతి తాతయ్య 2006లోనే మృతిచెందాడని ఖననం సమయంలో ఆయనెలా ఉంటారని ఆరోపించారు.

‘సిట్‌కు చెందిన ఏ అధికారి కూడా నిన్న విచారణ కోసం మా ఇంటికి రాలేదు. మొన్న ఉదయం 9గంటలకు వచ్చి మధ్యాహ్నం 2.30గంటల వరకు ఉన్నారు. యువతికి కరోనా సోకి మృతిచెంది ఉండవచ్చేమోనని జిల్లా మెజిస్ట్రేట్‌ ఆరోపిస్తున్నారు. అలాంటి అసత్య ఆరోపణలతో మరింత కుంగిపోయాం. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. మా అమ్మాయి మృతదేహాన్ని మాకెందుకు చూపించలేదు. సిట్ మీద మాకు నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు. 

దళిత యువతి హత్యాచార ఘటనపై దర్యాప్తు, నిబంధనలు ఉల్లంఘించి యువతికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హాథ్రస్‌ సూపరింటెండెంట్‌ సహా మరో నలుగులు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈనేపథ్యంలోనే జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ను కూడా సస్పెండ్‌ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని