రేపటి దేశవ్యాప్త ఆందోళనకు రైతులు సిద్ధం

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సోమవారం తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ ఆందోళనలో భాగంగా రైతు సంఘాల నేతలు ఒక్కరోజు..............

Updated : 13 Dec 2020 20:00 IST

ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొననున్న కర్షక నేతలు

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సోమవారం తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ ఆందోళనలో భాగంగా రైతు సంఘాల నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లోనే నిరాహార దీక్ష చేయనున్నట్లు నేతలు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేతలు నిరాహార దీక్షల్లో పాల్గొంటారని రైతు నేత గుర్నామ్‌సింగ్‌ చదునీ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతలు ఆదివారం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంతో చేతులు కలిపిన కొన్ని గ్రూపులు నూతన చట్టాలకు మద్దతు తెలిపాయని గుర్నామ్‌సింగ్‌ ఆరోపించారు. ఆ గ్రూపులేవీ ఎప్పుడూ తమతో లేవని స్పష్టంచేశారు. రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం పన్నుతున్న కుట్రలో ఇది భాగమన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌తో కొందరు రైతుల భేటీని ఉద్దేశించిన ఆయన ఈ విధంగా అన్నారు. తమ ఆందోళనకు మద్దతుగా దిల్లీ చేరుకుంటున్న రైతులను ప్రభుత్వ సంస్థలు అడ్డుకుంటున్నాయని ఇంకో రైతు నేత శివకుమార్‌ కక్కా విమర్శించారు. నూతన చట్టాలు రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఒకవేళ మరో విడత చర్చలకు ప్రభుత్వం ప్రతిపాదిస్తే కమిటీని ఏర్పాటు చేసి అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మరో రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. అలాగే ఈ నెల 19 నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేస్తున్నామని, దానికి బదులు సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నామని రైతు సంఘాల నేతలు తెలిపారు.

తోమర్‌తో ఉత్తరాఖండ్‌ రైతుల భేటీ

ఉత్తరాఖండ్‌కు చెందిన పలువురు రైతులు వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను ఆదివారం కలిశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు తమ మద్దతును తెలియజేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌధురి, ఉత్తరాఖండ్‌ విద్యాశాఖ మంత్రి అరవింద్‌ పాండే ఉన్నారు. రైతు చట్టాలకు మద్దతుగా ఉత్తరాఖండ్‌ రైతులు తనను కలిశారని తోమర్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా నూతన చట్టాలను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలని తెలిపారు.

ఇవీ చదవండి..

దిల్లీ సరిహద్దులకు అదనపు బలగాలు

రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష: కేజ్రీవాల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని