హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిష్కారం కాదు: WHO

కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Published : 19 Aug 2020 14:41 IST

ప్రపంచదేశాలకు మరోసారి హెచ్చరిక

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిష్కారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి అవసరమైన రోగనిరోధకతను పొందే వీలు దరిదాపుల్లో లేదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. హెర్డ్‌ ఇమ్యూనిటీపై వస్తున్న వార్తలను పూర్తిగా తోసిపుచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఆ దిశగా అడుగులు వేయకూడదని ప్రపంచదేశాలకు సూచించింది.

వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా కేవలం వ్యాక్సిన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నియంత్రణకు అసలు సహజ హెర్డ్‌ ఇమ్యూనిటీ సిద్ధాంతం పరిష్కారమే కాదని స్పష్టం చేసిన ఆయన.. కేవలం 10 నుంచి 20శాతం మంది మాత్రమే యాంటీబాడీలు కలిగి ఉన్న నివేదికల సారాంశాన్ని నొక్కిచెప్పారు.

దాదాపు 70శాతం ప్రజలు వైరస్‌కులోనై వారిలో యాంటీబాడీలు వృద్ధిచెందడాన్ని హెర్డ్‌ ఇమ్యునిటీ (మందగా రోగ నిరోధకశక్తి)గా పరిగణిస్తారు. సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువత, మధ్య వయస్కులకు వైరస్‌ సోకేలా చేసి వారిద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని సాధించాలనేది కొందరి వాదన. అయితే, ఇది ప్రమాదకర పోకడ అని, ఈ వైరస్‌ల నియంత్రణను కేవలం వ్యాక్సినైజేషన్‌ ప్రక్రియ ద్వారా సాధించాలని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోంది.

ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనావైరస్‌ ఇప్పటివరకు 2కోట్ల 20లక్షల మందిలో బయటపడింది. దీని బారినపడి ఇప్పటికే 7లక్షల 81వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని