కరోనా వేళ..కోర్టుల్లో 25లక్షల కేసుల విచారణ!

కరోనా సమయంలోనూ హైకోర్టులు, జిల్లా కోర్టులు కలిపి 25లక్షల కేసులను విచారించాయని, డిజిటల్‌ మాధ్యమం ద్వారానే వీటిని కొనసాగించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

Published : 25 Nov 2020 21:59 IST

ఒక్క సుప్రీం కోర్టులోనే 10వేల కేసుల విచారణ
వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ న్యాయవ్యవస్థ మాత్రం కేసుల విచారణను కొనసాగించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. కరోనా సమయంలోనూ హైకోర్టులు, జిల్లా కోర్టులు కలిపి 25లక్షల కేసులను విచారించాయని, డిజిటల్‌ మాధ్యమం ద్వారానే వీటిని కొనసాగించినట్లు తెలిపారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిబంధనలను సరళీకృతం చేయడం వల్లనే ఇది సాధ్యమైందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ న్యాయవ్యవస్థలో దాదాపు 85శాతం కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టులు, వందల సంఖ్యలో ఉన్న జిల్లా కోర్టుల్లో 25లక్షల కేసులను వర్చువల్‌‌ రూపంలో విచారణ చేసినట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. వీటిలో సుప్రీంకోర్టులోనే దాదాపు 10వేల కేసులు వర్చువల్‌ రూపంలో విచారించినట్లు గుర్తుచేశారు. ఏడు నగరాల్లో కొత్తగా వర్చువల్‌ కోర్టులను ప్రారంభించామని, మొత్తం 25లక్షల కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. అయితే, వీటిలో ఎక్కువగా ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులే ఉన్నాయని.. ఇలాంటి కేసుల నుంచి దాదాపు రూ. 115కోట్ల జరిమానా వసూలు చేశామని చెప్పారు.

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, భద్రతపై పడిందని..ఇదే సమయంలో మనకు ఎన్నో అవకాశాలను కల్పించిందన్నారు. ప్రస్తుతం కాలంలో సమాచార విప్లవమే ఆర్థిక వ్యవస్థను నడిపించబోతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో త్వరలోనే బలమైన సమాచార రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా వర్చువల్‌ కోర్టులను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటితో పాటు హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో సాంకేతిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని