ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకా

కరోనా మహమ్మారికి కళ్లెం వేయడంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఆశాజనకంగా కనిపిస్తోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. కోతుల్లో వైరల్‌ లోడును తగ్గించడంలో..

Published : 31 Jul 2020 10:21 IST

కోతుల్లో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షణ 

లండన్‌: కరోనా మహమ్మారికి కళ్లెం వేయడంలో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఆశాజనకంగా కనిపిస్తోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. కోతుల్లో వైరల్‌ లోడును తగ్గించడంలో, ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో ఇది దోహదపడుతున్నట్లు నిర్ధారించింది. అయితే- కొవిడ్‌ బారిన పడకుండా ముందే పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదేమోనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. సాధారణంగా కరోనా వైరస్‌ తన స్పైక్‌ ప్రొటీన్‌ ద్వారా మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంది.

 ఈ నేపథ్యంలో సదరు ప్రొటీన్‌ను నిలువరించే టీకాల అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. సాధారణ జలుబు వంటి అనారోగ్యాన్ని కలిగించే అడినోవైరస్‌లోనూ ఇలాంటి ప్రొటీన్‌ ఉంటుంది. దీంతో అడినోవైరస్‌ను బలహీనపర్చడం ద్వారా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ‘సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19’ అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేశారు. కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐఏఐడీ), ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా పరిశీలించారు. తమ అధ్యయనంలో భాగంగా ఆరు కోతులకు పరిశోధకులు టీకా అందించారు. అనంతరం 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్‌ కారణంగా తలెత్తే న్యుమోనియాను టీకా నిలువరించగలిగినట్లు గుర్తించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రోగ నిరోధక వ్యవస్థ నుంచి బలమైన ప్రతిస్పందనను కూడా అది రాబట్టగలిగినట్లు తేల్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని