మాజీ ముఖ్యమంత్రిని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారు..!

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారని..

Published : 29 Sep 2020 23:14 IST

జమ్మూ-కశ్మీర్‌ పరిపాలన విభాగాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఓ స్పష్టతనివ్వాలంటూ పరిపాలనా విభాగానికి సూచించింది. తన తల్లిని అక్రమంగా బంధించారంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమెను వెంటనే విడుదల చేయాల్సిందిగా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. మంగళవారం ఆ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. మాజీ ముఖ్యమంత్రిని ఇంకెంతకాలం నిర్బంధిస్తారని, నిర్బంధాన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా? అని అడిగింది.  ఈ విషయంలో ఓ స్పష్టతనివ్వాలని ప్రభుత్వానికి రెండు వారాల గడువు విధించింది. తల్లిని కలిసేందుకు ముఫ్తీ కుమార్తె సహా కుమారుడికి అనుమతి కల్పించింది. 

గతేడాది ఆగస్టు 5వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో అల్లర్లు చెలరేగకుండా అరికట్టేందుకు ముందస్తు చర్యగా మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధించారు. కుటుంబసభ్యులు కూడా ఆమెను కలువకుండా నిబంధనలు విధించారు. అయితే నిర్బంధం విధించి ఏడాది గడిచిపోయినా ఆమెకు ఇంకా విముక్తి కల్పించలేదు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన విడుదల గడువు నిర్ణయించినప్పటికీ ఆ గడువును పొడిగించారు. విడుదలపై ఎలాంటి తేదీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రెండు వారాల్లోగా ఆమె విడుదలపై ఓ స్పష్టతనివ్వాలని న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పరిపాలనా విభాగానికి సూచించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని