
క్వారంటైన్ చేసింది నన్ను కాదు.. కేసు దర్యాప్తును
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసు విచారించేందుకు ముంబయి వెళ్లిన బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ ఎట్టకేలకు క్వారంటైన్ నుంచి విడుదలయ్యారు. బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) ఆయనకు విధించిన క్వారంటైన్ నిబంధనలు సడలించడంతో శుక్రవారం వినయ్ తివారీ పట్నాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. క్వాంరటైన్లో ఉంది నేను కాదు, కేసు విచారణ. సుశాంత్ కేసులో బిహార్ పోలీసుల దర్యాప్తుకు అడ్డంకులు కలిగించారు’’ అని అన్నారు.
పట్నాలో సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిని విచారించేందుకు బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ ఆగస్టు 2న ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్రలో కరోనా నిబంధనల అమలులో ఉండటంతో బీఎంసీ వర్గాలు ఆయనను 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో బిహార్ పోలీసుల విచారణకు ముంబయి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా బిహార్ ప్రభుత్వ అభ్యనర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తివారీ తిరుగు ప్రయాణానికి అనుమతించాలని కోరుతూ బిహార్ పోలీసులు బీఎంసీ వర్గాలకు లేఖ రాయడంతో ఆయన క్వారంటైన్ నుంచి పట్నాకు బయల్దేరారు.
తాజాగా ఈ కేసులో సీబీఐ రియా చక్రవర్తితో కలిసి ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి కేసు నమోదుచేసింది. రియాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టులో తను దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, తనను ప్రశ్నించడం వాయిదా వేయాలని ఆమె ఈడీని కోరంది. రియా వాదనను సంస్థ తోసిపుచ్చడంతో శుక్రవారం ఆమె ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. అలానే ఈ కేసులో ముంబయి పోలీసులు రియాకు సహకరిస్తున్నారని బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.