వీటో చేస్తా.. డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా రక్షణ రంగ బిల్లును వీటో చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బెదిరించారు.

Published : 15 Dec 2020 02:03 IST

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ రంగ బిల్లును తనకున్న విశేషాధికారాలతో వీటో చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. 740 మిలియన్‌ డాలర్ల భారీ బిల్లు వల్ల అత్యధికంగా లాభపడేది చైనాయేనంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయమై ‘‘మన కొత్త రక్షణ బిల్లు వల్ల చైనాకు భారీ గెలుపు లభిస్తుంది. నేను దానిని వీటో చేస్తాను!’’ అని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఓడల కొనుగోలు, సైనికుల జీతభత్యాలు, భౌగోళిక విపత్తులను ఎదుర్కొనే విధానం తదితర కీలక విషయాలు నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్డీఏఏ) బిల్లు పరిధిలోకి వస్తాయి. కాగా, దీనిని అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ఇరుసభలూ మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో ఇప్పటికే ఆమోదించాయి.

2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎన్డీఏఏ బిల్లును అధ్యక్షుడు ట్రంప్‌ తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనిలో గూగుల్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సాంకేతిక సంస్థలకు అనుకూలంగా ఉన్న సెక్షన్‌ 230ని తొలగించకపోవటం పట్ల ఆయన విముఖంగా ఉన్నారు. సామాజిక మాధ్యమ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలలో కనిపించే సమాచారాన్ని నియంత్రించగల అధికారం ఈ సెక్షన్‌ ద్వారా లభిస్తుంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో జోరందుకున్న బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ నిరసనల ఉదంతం నుంచీ ట్రంప్‌ సోషల్‌ మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. అవి పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నాయని ఆయన పలుమార్లు ఆరోపించగా.. అది అబద్ధమంటూ ఆయా సంస్థలు ఖండిస్తూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రక్షణ రంగ బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు సెనేట్‌, ట్రంప్‌నకు పదిరోజుల వ్యవధి నిచ్చింది. కాగా, ఈ బిల్లు కాలవ్యవధి జనవరి 3వ తేదీతో ముగియనుంది. దీనితో సదరు బిల్లును వీటో చేయాలా లేదా చట్టంగా మారేందుకు అనుగుణంగా సంతకాలు చేయాలా నిర్ణయం ట్రంప్‌ పరిధిలోనే ఉంది.

ఇదీ చదవండి

కరోనా మరింత తీవ్రం.. గేట్స్‌

వైట్‌ హౌస్‌ సిబ్బందికి ముందే టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని