కరోనా తీవ్రతకు ఆ మూడు ప్రధాన కారణాలు!

గత కొద్దిరోజులుగా దేశరాజధానిలో కరోనా మరణాల పెరుగుదల కలవరం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితికి మూడు ప్రధాన కారణాల ఉన్నాయని పలువురు వైద్య నిపుణులు వెల్లడించారు. కొవిడ్‌-19 సోకిన వారు ఆస్పత్రుల్లో ఆలస్యంగా చేరడంతో

Updated : 19 Oct 2022 11:36 IST

దిల్లీ: గత కొద్దిరోజులుగా దేశరాజధానిలో కరోనా కేసులు, మరణాల పెరుగుదల కలవరం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు. కొవిడ్‌-19 సోకిన వారు ఆస్పత్రుల్లో ఆలస్యంగా చేరడంతో పాటు, ఐసీయూ బెడ్ల కొరత ఉండటం, కాలుష్యం అధికమవడమే మరణాల రేటు పెరుగుదలకు కారణాలుగా వారు వెల్లడించారు.  కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య జాతీయ సగటు 1.46శాతం ఉండగా.. దిల్లీ సగటు 1.86శాతానికి పెరిగింది. 

రామ్‌మనోహర్‌‌ లోహియా ఆస్పత్రి వైద్యులు రానా ఏకే సింగ్‌ మాట్లాడుతూ.. ‘వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగానే పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు బారిన పడే అవకాశం ఉంటుంది. కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. గంగారాం ఆస్పత్రి ఛైర్మన్‌ రానా మాట్లాడుతూ.. ‘చాలా ఆస్పత్రుల్లో ఇప్పటికే ఐసీయూలు నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా రోగులు వ్యాధి తీవ్రతతో వస్తే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఐసీయూ బెడ్ల కొరత కూడా తీవ్రతకు కారణమవుతోంది’అని తెలిపారు. ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణులు డా. సమీరన్‌ పండా మాట్లాడుతూ.. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం మేలు అని చెప్పారు. ఆలస్యం చేయడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. 

కాగా దిల్లీలో గత 13 రోజుల్లో ఏడు రోజులు 100పైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. పాజిటివిటీ రేటు 11.94గా రికార్డయింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకారం.. కొవిడ్‌ కారణంగా మంగళవారం 109, ఆదివారం 121, శనివారం 111, శుక్రవారం 118, నవంబర్‌ 18న 131, నవంబర్‌ 12న 104 మంది మరణించినట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌ మంగళవారం ప్రధాని మోదీ సమావేశంలో ఐసీయూ బెడ్ల కొరత గురించి చర్చించారు. అదనంగా 1000 ఐసీయూ బెడ్లు అందించాలని కోరారు. అదేవిధంగా కాలుష్యాన్ని ఉద్దేశిస్తూ.. పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నియంత్రణ విషయంలో ప్రధాని మోదీ చొరవతీసుకోవాలి. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయంగా బయోడికంపోజర్‌ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుందని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని