IMD: గురి తప్పుతున్న ఐఎండీ అంచనాలు!

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాల ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి.

Published : 12 Jul 2021 10:38 IST

దిల్లీ: భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాల ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. రైతులు కూడా ఆ విభాగం సమాచారంపైనే ఆధారపడతారు. అయితే ఈ సారి ఐఎండీ అంచనాలు తప్పుతున్నాయి. రుతుపవనాల రాక నుంచి విస్తరణ వరకూ అంతా అయోమయమే. ముందు ఒక సూచన చేస్తోంది. ఆ తర్వాత ఇంకో సవరణ ఇస్తోంది. అయితే ఈసారి లెక్క తప్పడానికి తూర్పు, పశ్చిమ గాలుల మధ్య పరస్పర చర్యల ఫలితాలను విశ్లేషించడంలో ఐఎండీ విఫలమవ్వడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

అంచనాపై అంచనా

జూన్‌లోనే నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికింకా దిల్లీ సహా ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి జాడే లేదు. జూన్‌ 15 కల్లా దిల్లీకి నైరుతి రానుందని ఆ నెల 13న తెలిపింది. ఆ తర్వాత రోజే అందుకు పరిస్థితులు సానుకూలంగా లేవంటూ తన అంచనాలను తానే సవరించుకుంది. మళ్లీ ఏడో తేదీకల్లా దేశరాజధానికి నైరుతి రావడం ఖాయమని జులై 1న పేర్కొంది. జులై 5న మళ్లీ ఇంకో ప్రకటన చేస్తూ.. పదో తేదీకల్లా విస్తరిస్తాయని తెలిపింది. పదో తేదీ గడిచిపోయింది. ఇంకా ఆ ప్రాంత వాసులు నైరుతి కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. రుతుపవనాలు విస్తరణకు సంబంధించే కాదు.. పవనాల రాకను కూడా ఈసారి ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయింది. మే 31న కేరళ తీరాన్ని నైరుతి తాకనుందని ఆ నెల 30 వరకూ చెబుతూ వచ్చింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ తన అంచనాలను సవరించుకొని జూన్‌ 3 అంటూ కొత్త తేదీని ప్రకటించింది. ‘‘ముందుగా మేమిచ్చిన ప్రారంభ సూచనలు తప్పాయి. అందుకు అనుగుణంగా ఐఎండీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది’’ అని మాజీ ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ అజిత్‌ త్యాగి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని