Published : 15 Sep 2020 16:08 IST

వారికి అదే తగిన శిక్ష..!

రేపిస్టులపై పాకిస్థాన్‌ ప్రధాని అభిప్రాయం

ఇస్లామాబాద్‌: అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్‌) చేయాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు. వీటిద్వారానే అత్యాచారాలను అరికట్టవచ్చన్నారు. తాజాగా లాహోర్‌లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

లాహోర్‌కు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కారులో బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో కారులో ఇంధనం‌ అయిపోవడంతో తన భర్తకు సమాచారం ఇచ్చింది. అతను అక్కడికి చేరుకునేలోపే ఇద్దరు సాయుధ దుండగులు దీనిని గమనించారు. వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి, తుపాకులతో బెదిరించి వారిని బయటకులాగారు. ఇద్దరు చిన్నారుల ముందే మహిళపై అత్యాచారం చేసి పారిపోయారు. అనంతరం ఆ మహిళ పోలీసుల సాయం కోరినా.. వారుకూడా సరిగా స్పందించలేదని విచారణలో తేలింది. అంతేకాకుండా పురుషుల సాయం లేకుండా రాత్రి సమయంలో బయటకు వెళ్లడం తప్పని బాధిత మహిళనే అక్కడి పోలీసులు తప్పుబట్టారు. పోలీసుల స్పందనపై మరింత కోపోద్రిక్తులైన పాక్‌ మహిళలు, వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.

ఈ సమయంలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఘటనపై స్పందించారు. ‘ఇలాంటి నీచమైన అత్యచార ఘటనల్లో నిందితులను బహిరంగంగా ఉరితీయాలి. కానీ, ఈ చర్యలవల్ల మరణశిక్షను వ్యతిరేకిస్తున్న దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే, ఇటువంటి వారికి ఔషధాల సాయంతో పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్‌) చేయాలని అభిప్రాయపడుతున్నా’ అని స్పష్టంచేశారు. ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ డిగ్రీ శిక్షల్లాగానే లైంగిక నేరాల్లో నిందితులకు కూడా క్యాస్ట్రేషన్‌ వంటి శిక్ష ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో ఇలాంటి పద్ధతిని అవలంభిస్తున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ మీడియాతో పేర్కొన్నారు.

ఈ ఘటనలో నిందితులుగా భావిస్తోన్న ఇద్దరిలో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బజ్దార్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇదిలాఉంటే, పాకిస్థాన్‌లో అత్యాచార శిక్షలను విచారించడం ఒక సవాల్‌ అనే చెప్పవచ్చు. తమకు జరిగిన పరాభవాన్ని బయటకు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే వెసులుబాటు అక్కడి‌ మహిళలకు లేదన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. అంతేకాకుండా అక్కడి మహిళలపై పోలీసులకు ఉండే చిన్నచూపు, మహిళలకు స్వేచ్ఛలేకపోవడం వంటివి కూడా ఇలాంటి నేరాలు బయటకు రాకపోవడానికి మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నైజీరియాలో ఇలాంటి నిర్ణయమే..!

అత్యాచార నేరాల్లో ఏ శిక్షను విధించాలనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. మహిళల జీవితాల్ని దుర్భరంగా మార్చే ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని తాజాగా నైజీరియాలోని ఓ ప్రాంతం నిర్ణయించింది. నైజీరియాలోని కుదుమా రాష్ట్రంలో ఈ మధ్య అత్యాచార నేరాలు తీవ్రమవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 14 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచార కేసుల్లో దోషిగా తేలినవారిని కృత్రిమ పద్ధతిలో పురుషత్వం కోల్పోయేలా(క్యాస్ట్రేషన్‌) చేయాలని అక్కడి  ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, అత్యాచార కేసుల్లో దోషులకు క్యాస్ట్రేషన్‌ చేయాలన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా భిన్న వాదనలున్నాయి. దీనివలన వారి శారీరక, తీవ్ర మానసిక సమస్యలు ఏర్పడతాయనే అభిప్రాయం కూడా ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని