బీరుట్‌ బ్లాస్ట్‌: స్వతంత్ర దర్యాప్తు జరపాలి-ఐరాస!

లెబనాన్‌లో రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుళ్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనలో 150మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో బాధితులుగా మారారు. ఈ సందర్భంలో జవాబుదారీ కోరుతున్న బాధితుల గొంతుకను తప్పక వినాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం స్పష్టం చేసింది

Published : 07 Aug 2020 19:53 IST

157కు చేరిన మృతుల సంఖ్య, 5వేలకుపైగా గాయాలు
వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

బీరుట్‌: లెబనాన్‌లో రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుళ్లపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ దుర్ఘటనలో 150మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో జవాబుదారీ కోరుతున్న బాధితుల గొంతుకను తప్పక వినాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం స్పష్టం చేసింది. బీరుట్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం అధికార ప్రతినిధి రూపెర్ట్‌ కోల్‌విల్లే ప్రపంచదేశాలను కోరారు. అత్యంత వేగంగా స్పందించి లెబనాన్‌ను ఆదుకోవడంలో సాయపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న లెబనాన్, కరోనావైరస్‌తోపాటు అమ్మోనియం నైట్రేట్‌వంటి సంక్షోభాలతో సతమతమవుతోందని కోల్‌విల్లే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో లెబనాన్‌ నాయకులు రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో లెబనాన్‌ భారీ నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే.

ఆందోళనలతో దద్దరిల్లిన బీరుట్‌..
బీరుట్‌లో భారీ పేలుళ్లకు లెబనాన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నగరవాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన నిరసనకారులు వీధుల్లోని వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు. వీటిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి దిగారు. దీంతో అటు పోలీసులు, నిరసనకారులు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 
ఇదిలా ఉంటే, బీరుట్‌ దుర్ఢటనలో మరణించిన వారిసంఖ్య 157కు చేరగా గాయపడిన వారిసంఖ్య 5వేలు దాటింది.

ఇవీ చదవండి..
అణ్వస్త్ర దాడిని తలపించిన విధ్వంసం
బీరుట్‌లో పేలుడు జరిగే సమయంలో ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు