24 గంటల్లో 97,570 కేసులు.. 1,201 మరణాలు

భారత్‌లో కరోనా కొత్త కేసులు రోజురోజుకీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,91,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 97,570 కేసులు వెలుగులోకి వచ్చాయి.........

Updated : 12 Sep 2020 10:23 IST

దిల్లీ: భారత్‌లో కరోనా కొత్త కేసులు రోజురోజుకీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,91,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 97,570 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. వీరిలో 9,58,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 36,24,196 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,201 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 77,472కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.77 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.66 శాతంగా ఉంది. అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక కేసుల సంఖ్య 14,836 మేర పెరిగింది.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 19,218 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,61,798 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 28,232 మంది మృత్యువాతపడ్డారు. ఇక 97,338 యాక్టివ్‌ కేసులతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4,072 మంది మృతిచెందారు. తమిళనాడు, కర్ణాటక, దిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో మూడో వంతు మంది కోలుకొని ఇళ్లకు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 28,331,928 కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,13,018 మంది మృత్యువాతపడ్డారు. 64,43,227 కేసులు, 1,92,968 మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. భారత్‌, బ్రెజిల్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని