వచ్చే ఫిబ్రవరి కల్లా చివరి దశకు కరోనా!

దేశంలో కరోనా వైరస్‌ గరిష్ఠ స్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కొవిడ్‌ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది

Published : 18 Oct 2020 16:30 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయి దాటిపోయిందని కేంద్రం నియమించిన కొవిడ్‌ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. అన్ని జాగ్రత్త చర్యలు పకడ్బందీగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం కరోనా వైరస్‌కు సంబంధించి పలు కీలక విషయాల్ని వెల్లడించింది. దేశంలో కొవిడ్‌ తీవ్రత, అంచనాలపై కేంద్రం ఐఐటీ, ఐసీఎంఆర్‌ సభ్యులతో కొవిడ్‌-19 భారత్‌ సూపర్‌ మోడల్‌ పేరుతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ నేతృత్వం వహిస్తున్నారు.

‘భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత అంచనాలను దాటిపోయింది. పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి కల్లా మహమ్మారిని నియంత్రించవచ్చు. కానీ రానున్న శీతాకాలం, పండగల సీజన్‌ నేపథ్యంలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు కొనసాగించాలి. మాస్క్‌లు, శానిటైజేషన్‌ వంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా కొనసాగించాలి’ అని ప్రత్యేక కమిటీ స్పష్టం చేసింది.

2021 ఫిబ్రవరిలో మహమ్మారి చివరి దశకు చేరుకునే నాటికి దేశంలో 1.5కోట్ల కేసులు నమోదవుతాయని కమిటీ అంచనా వేసింది. ఒకవేళ మార్చిలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే.. దేశంలో కరోనా మృతుల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు వరకు 25లక్షలు దాటిపోయి ఉండేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా వెళ్తోందని.. తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అవసరమైతేనే లాక్‌డౌన్‌ విధించాలని పేర్కొంది. బహిరంగంగా గుంపులుగా చేరడం కారణంగా వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని నిరూపించడానికి కేరళలో నిర్వహించిన ఓనం పండగ ఓ ఉదాహరణగా కమిటీ తెలిపింది. ఆగస్టులో అక్కడ ఓనం నిర్వహించడంతో సెప్టెంబర్‌లో ఒకేసారి కేసుల సంఖ్య పెరగడం గమనించినట్లు కమిటీ వెల్లడించింది.  కాగా దేశంలో ఇప్పటి వరకు 75లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.14లక్షల మంది మహమ్మారి బారిన పడి మరణించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు