వాతావరణ మార్పులతో చదువుకు దూరం

వాతావరణ మార్పులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దాని పరిష్కారానికి అత్యవసర వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడిచేసింది

Updated : 10 Nov 2020 05:02 IST

ముంబయి: వాతావరణ మార్పులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దాని పరిష్కారానికి అత్యవసర వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడిచేసింది. ‘ప్రొటెక్ట్‌ ఏ జనరేషన్: క్లైమేట్ సెక్యూరిటీ ఫర్ ఇండియాస్‌ చిల్డ్రన్’ శీర్షికన ఈ నివేదికను విడుదల చేసింది. సేవ్‌ ది చిల్డ్రన్ సీఈఓ బిడిశా పిళ్లై, పీడబ్ల్యూసీ గ్లోబల్ ఆఫీస్ ఫర్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ వైస్ ఛైర్మన్ జైవీర్ సింగ్ సంయుక్తంగా ఈ నివేదికను సిద్ధం చేశారు.  

‘వ్యవసాయం, తీరప్రాంత జీవనోపాధిపై ఆధారపడిన జనాభా(పిల్లలతో సహా)కు వాతావరణ మార్పుల కారణంగా అసమాన ప్రమాదం పొంచి ఉంది’ అని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే చిన్నారులు ఈ మార్పుల భారం భరిస్తారని, ఇది వారి మనుగడ, భద్రత, అభివృద్ధి వంటి వారి ప్రాథమిక హక్కును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. కాగా, వాతావరణ మార్పుల ప్రభావాలను అనుభవిస్తోన్న ప్రాంతాల గురించి సోదాహరణంగా వివరించింది.

* వ్యవసాయ ఉత్పాదకత క్షీణించడంతో దానిపై ఆధారపడిన పశ్చిమ బెంగాల్‌లోని మోరేనా, పురూలియా ప్రాంతాల్లోని కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ఆ కారణంగా ఆ ఇళ్లలోని చిన్నారులు చదువును మానేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

*మధ్యప్రదేశ్‌లోని ఖార్గావ్ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీరు లభ్యత లేకపోవడంతో.. అది పిల్లల్లో డీహైడ్రేషన్‌కు దారితీసింది.

కాగా, పిల్లల భద్రతను నిర్ధారించడానికి వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అమలు చేయాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఈ నివేదిక  సూచనలు చేసింది. చిన్నారులపై చూపే ప్రభావాలను పరిష్కరించడానికి భారత్‌ సరైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని