లాక్‌డౌన్‌ దిశగా మరిన్ని నగరాలు..!

కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తాజాగా భారత్‌లో ఈ కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఆ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులను చేపడుతూనే తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లొ వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి.

Updated : 17 Jul 2020 13:40 IST

వైరస్‌ కట్టడి చర్యల్లో రాష్ట్రాల నిర్ణయం..
భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తాజాగా భారత్‌లో ఈ కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఆ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులను చేపడుతూనే తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు,  అసోంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లొ వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. ఈ సమయంలో దాదాపు అన్నిప్రాంతాల్లో వ్యవసాయ పనులు, అత్యవసర సర్వీసులు, సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాయి.

ఒడిశాలో..
ఒడిశాలో ఇప్పటివరకు 15,300పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇప్పటికే వీరిలో 10వేల మంది కోలుకున్నారు. అయినప్పటికీ కొన్నిజిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది.  కటక్‌, గంజాం, జజ్‌పూర్‌, ఖుద్రా జిల్లాల్లోనే దాదాపు 66శాతం కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాల్లో జులై 31వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం నుంచి 14రోజులపాటు ఈ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని స్పష్టంచేసింది. లాక్‌డౌన్‌ కాలంలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు పూర్తిగా మూసిఉంచాలని ఆదేశించింది. నిత్యావరసర దుకాణాలు మాత్రం ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు తెరుచుకోవడానికి వీలుకల్పించింది.

బిహార్‌లో..
బిహార్‌లో కరోనావైరస్‌ విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 21,700కు చేరుకుంది. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. నిన్నటినుంచి ఈ నెల 31వరకు 16రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. రాజధాని పాట్నాలోనూ పూర్తి లాక్‌డౌన్‌ పాటిస్తోంది. రవాణా వ్యవస్థతోపాటు ప్రార్థనా మందిరాలు పూర్తిగా మూసే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బెంగళూరులో..
కర్ణాటకలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 4169పాజిటవ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ రోగుల సంఖ్య 51వేలు దాటింది. అంతేకాకుండా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. నిన్న ఒక్కరోజే నగరంలో 70మంది మృత్యువాతపడడంతో మొత్తం మరణాల సంఖ్య 507కు చేరింది. ఇప్పటికే 5598 కంటైన్మెంట్‌ జోన్లను గుర్తించిన నగరపాలక సంస్థ వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. ముందే అప్రమత్తమైన ప్రభుత్వం బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది.

మహారాష్ట్రలోని పుణెలో..
దేశంలోనే అత్యధికంగా మహరాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసులు, మరణాల్లో దాదాపు 45శాతం ఈ ఒక్క రాష్ట్రంలోనే చోటుచేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో సడలింపులతోకూడిన లాక్‌డౌన్‌ను జులై 31వరకు ఇప్పటికే పొడగించింది. ముంబయితోపాటు పుణెలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో పుణె అధికారులు మరో 15రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. నగరం చుట్టూ ప్రత్యేకంగా 55 చెక్‌పాయింట్లను ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని నిరోధిస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో వారాంతంలో లాక్‌డౌన్‌..
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా శని, ఆది వారాల్లో పూర్తి లాక్‌డౌన్‌ పాటించాలని అధికారులు ఆదేశించారు. మిగతారోజుల్లోనూ ఉదయం 9నుంచి రాత్రి 9గంటల వరకే కార్యకలాపాలు సాగించాలని సూచించారు. అయితే ప్రార్ధనా మందిరాలు మాత్రం తెరిచేఉంటాయని స్పష్టం చేసింది. 

ఇక తమిళనాడులోనూ రెండో దఫా లాక్‌డౌన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వైరస్‌ తీవ్రత అధికం కావడంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇలా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు వైరస్‌ను కట్టడిచేసేందుకు స్థానికంగా మరోసారి లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు.

ఇవీ చదవండి..
భారత్‌లో 10లక్షలు దాటిన కరోనా కేసులు..
ఆగస్టు 10నాటికి దేశంలో 20లక్షల కేసులు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని