మిడతల దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాం: మోదీ

దేశంలో మిడతల దాడిని సమర్థంగా ఎదుర్కొన్నామమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అధునాత సాంకేతిక పద్ధతుల్లో వీటిని అడ్డుకుని పెద్దఎత్తున పంట నష్టం జరగకుండా కాపాడుకున్నామని చెప్పారు. యూపీలోని ఝాన్సీలో......

Published : 29 Aug 2020 21:04 IST

కరోనా లేకుంటే వారం పాటు దీనిపై చర్చ జరిగేది

దిల్లీ: దేశంలో మిడతల దాడిని సమర్థంగా ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అధునాత సాంకేతిక పద్ధతుల్లో వీటిని అడ్డుకుని పెద్ద ఎత్తున పంట నష్టం జరగకుండా కాపాడుకున్నామని చెప్పారు. యూపీలోని ఝాన్సీలో రాణీ లక్ష్మీ బాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కళాశాల, పరిపాలనా భవనాలను వర్చువల్‌ పద్ధతిలో ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక అవసరాన్ని నొక్కి చెప్పారు.

‘‘యూపీలోని బుందేల్‌ ఖండ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాలు మిడతల దాడిని ఎదుర్కొన్నాయి. సంప్రదాయ పద్ధతుల్లో అయితే వాటిని ఎదుర్కోలేకపోయేవాళ్లం. శాస్త్రీయ పద్ధతుల్లో కాబట్టే వాటిని అరికట్టగలిగాం. ఇదో పెద్ద విజయం. ఒకవేళ కరోనా వైరస్‌ లేకపోయి ఉంటే ఈ విజయంపై వారం పాటు మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగి ఉండేది’’ అని నరేంద్ర మోదీ అన్నారు. మిడతలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం డజనుకు పైగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక స్ప్రే యంత్రాలను అధికారులు అందజేశారని చెప్పారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లకుండా డ్రోన్లు, హెలికాప్టర్లు వినియోగించారంటూ అధునాతన సాంకేతిక పరికరకాల అవసరాన్ని చెప్పారు.

డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి పద్ధతులను ఏ విధంగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలో ఆ దిశగా యువ పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆలోచన చేయాలని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ పరిశోధనలు పంట పొలాలకే నేరుగా చేరుకునేలా తమ ప్రభుత్వం గత ఆరేళ్లుగా కృషి చేస్తోందని, చిన్న రైతులకు సైతం సలహాలు అందుతున్నాయని తెలిపారు. కళాశాల ప్రాంగణం నుంచి పంట పొలాల వరకు నిపుణల వ్యవస్థను బలోపేతం చేయాలని, అందులో రాణీ లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రధాన పాత్ర పోషించగలదని ప్రధాని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు