Published : 16 Oct 2020 17:24 IST

భారీగా పెరిగిన ‘భారతీయుల ఆయుష్షు’!

అంతర్జాతీయ నివేదిక వెల్లడి

దిల్లీ: భారతీయుల సగటు జీవితకాలం గత మూడు దశాబ్దాల కాలంలో భారీగా పెరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1990 సంవత్సరంలో 59.6 ఏళ్లుగా ఉన్న భారతీయుల ఆయుర్దాయం 2019నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, వీటిలో రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో సగటు జీవితకాలం అత్యధికంగా 77.3 సంత్సరాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 66.9 ఏళ్లుగా ఉన్నట్లు తేలింది. ఈ ముప్పై సంవత్సరాల కాలంలో భారతీయుల సగటు ఆయుష్షు పది సంవత్సరాలు పెరిగింది. వ్యక్తి మరణాలకు గల కారణాలు, వ్యాధుల తీవ్రతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేపట్టారు. దీనిలో భాగంగా మరణాలకు గల 286 కారణాలు, 369 వ్యాధులు, వివిధ రకాల గాయలను విశ్లేషిస్తూ 200 దేశాల్లో అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయన నివేదిక తాజాగా ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైంది.

మనదేశంలో వ్యక్తుల ఆయుర్దాయం భారీగా పెరిగినప్పటికీ ఆరోగ్యవంతమైన జీవితకాలం గడుపలేకపోతున్నారని, ఎక్కువ కాలం అనారోగ్యం, ఇతర వైకల్యాలతోనే గడుపుతున్నట్లు పరిశోధనలో పాల్గొన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ గోలీ వెల్లడించారు. గడిచిన ముప్పై సంత్సరాలుగా స్థూలకాయం, అధిక షుగర్‌, కాలుష్యం కారకాలతో ప్రభావితం కావడం వల్ల ప్రస్తుతం కరోనా సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు తాజా నివేదిక అభిప్రాయపడింది. ఈ 30ఏళ్లలో ఆరోగ్య రంగంలో భారత్‌ గణనీయమైన మార్పును సాధించిందని నిపుణుల బృందం స్పష్టంచేసింది. అయితే, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఇంకా పోషకాహారం లోపంతో పిల్లలు, బాలింతలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

భారత్‌తో సహా దాదాపు ప్రతిదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి తగ్గినప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన అలీ మొక్దాద్‌ పేర్కొన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు, ఇమ్యునైజేషన్‌ వంటి కార్యక్రమాల వల్ల అంటువ్యాధుల తీవ్రతను చాలా దేశాలు అరికట్టగలుతున్నట్లు తెలిపారు. ఇక దేశంలో గతంలో ఎక్కువగా కనిపించిన మాతాశిశు మరణాల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. అయితే, గుండె సంబంధ వ్యాధులు ఐదో స్థానంలో ఉండగా ప్రస్తుతం అవి మొదటి స్థానంలోకి వచ్చాయని, వీటితో పాటు కాన్సర్‌లు భారీగా పెరినట్లు మొక్దాద్‌ తెలిపారు.

దీర్ఘకాలిక వ్యాధుల సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉందని, వీటిలో ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమవుతున్నట్లు పరిశోధన చేపట్టిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా అధిక రక్తపోటు, పొగాకు వాడకం, గాలికాలుష్యం వంటి ప్రమాదకర పరిస్థితులను నిరోధించే వీలున్నప్పటికీ వీటిపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు అభిప్రాయపడింది. దీంతో కరోనా వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ప్రజలు గురికావాల్సి వస్తుందని పరిశోధన బృందం స్పష్టంచేసింది.

నివేదికలోని మరికొన్ని విషయాలు..

* అనారోగ్య సమస్యలు, మరణాలకు ముప్పై ఏళ్ల ముందు అంటువ్యాధులు, మాతాశిశు మరణాలు, పోషకాహార లోపంతో కలిగిన వ్యాధులు కారణమైతే.. ప్రస్తుతం నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) ఎక్కువగా కారణమవుతున్నాయి.
* 1990లో 29శాతం ఉన్న ఎన్‌సీడీ మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం వ్యాధుల్లో దాదాపు 58శాతానికి పెరిగాయి. అంతేకాకుండా అకాల మరణాలు దాదాపు 22శాతం నుంచి 55శాతానికి పెరిగాయి.
* గుండె జబ్బులు, సీఓపీడీ, మధుమేహం, గుండెపోటు, కండరాల బలహీనత వ్యాధులతోనే ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నారు.
* 2019లో భారత్‌లో మరణాలకు గాలికాలుష్యమే ప్రధానకారణం కాగా, దీని కారణంగా దాదాపు 16లక్షల మరణాలు సంభవించాయి. తరువాతి స్థానాల్లో హైబీపీ (14.7లక్షలు), పొగాకు వాడకం (12.3లక్షలు), ఆహారలేమి (11.8లక్షలు), బ్లడ్‌ షుగర్ ‌(11.2లక్షలు) వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయి.

ముఖ్యంగా దక్షిణాదిలోని ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 10-20శాతం మరణాలకు హైబీపీ కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గాలి కాలుష్యం తర్వాత అత్యంత ప్రమాదకరంగా హైబీపీ ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాలు ఎక్కువగా సంభవించడంలో స్థూలకాయం, మధుమేహం సమస్యలు కూడా ప్రధాన కారణమవుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటి సమయంలో దీర్ఘకాల వ్యాధులు, సామాజిక అసమానతలను పరిష్కరించడానికి అత్యవసర చర్యలు అవసరమని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రమాదకారకాలు సాధ్యమైనంతవరకు నివారించదగినవి కావడంతోపాటు చికిత్సకు కూడా ఆస్కారం ఉందని స్పష్టంచేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని