ఫైజర్‌ వ్యాక్సిన్‌ అవసరం ఉండకపోవచ్చు

భారత్‌లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలిస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్‌ టీకా భారత్‌కు అవసరమయ్యే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు....

Published : 24 Nov 2020 15:50 IST

ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: భారత్‌లో అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాలు ఉత్తమ ఫలితాలిస్తున్నాయని, అమెరికాకు చెందిన ఫైజర్‌ టీకా భారత్‌కు అవసరమయ్యే అవకాశం ఉండకపోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశానికి చెందిన ఉత్తమ సంస్థలు ఐదు టీకాలను అభివృద్ధి చేస్తున్నాయని, అలాంటప్పుడు అమెరికాలోనే వినియోగానికి ఇంకా అనుమతులు లభించని ఫైజర్‌ టీకాను భారత్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఆ వ్యాక్సిన్‌కు అమెరికాలో ఆమోదం లభించినా.. ముందుగా ఆ దేశస్థులకే ప్రధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.

భారత్‌లో దాదాపు ఐదు సంస్థలు కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా టీకా మూడో దశ పరీక్షలను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తోంది. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకా రెండు దశలను పూర్తిచేసుకొని మూడో దశలోకి అడుగుపెట్టింది. రెండో దశ పరీక్షల ఫలితాలు ఏ సమయంలోనైనా వెలువడే అవకాశం ఉంది. జైడస్‌ క్యాడిలా హెల్త్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవిడ్‌ కూడా రెండో దశ పరీక్షలను పూర్తి చేసుకుంది.

ఈ మూడు టీకాలే కాకుండా రష్యా అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ పరీక్షలను హైదరాబాద్‌కు చెందిన డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ ‘బయోలాజికల్‌ ఇ’కి చెందిన టీకా మొదటి, రెండో దశ ప్రయోగాల్లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని