పాక్.. మా విషయాల్లో జోక్యం వద్దు: భారత్‌

కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. ఐరాసలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యల్లో కశ్మీర్‌ సమస్య ఒకటని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పాక్‌ వాదనను భారత్‌ ఖండించింది. కుట్రలను పక్కన పెట్టి ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఐక్య రాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా..

Published : 22 Sep 2020 11:02 IST

న్యూయార్క్‌: కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. ఐరాసలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యల్లో కశ్మీర్‌ సమస్య ఒకటని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పాక్‌ వాదనను భారత్‌ ఖండించింది. కుట్రలను పక్కన పెట్టి ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఐక్య రాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ వీడియో సందేశాన్నిస్తూ ప్రపంచంలో శాంతిస్థాపన కోసం ఐరాస చేస్తున్న కృషిని కొనియాడారు. ఐరాస విజయాలను ప్రశంసిస్తూ..  కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. 

సభ్య దేశాలకు ఐరాస ఎంతో తోడ్పాటునందిస్తున్నప్పటికీ, జమ్ముకశ్మీర్‌, పాలస్తీనా లాంటి వివాదాలకు ఓ పరిష్కారం చూపడం లేదని ఖురేషీ అన్నారు. ఆక్రమిత జమ్ముకశ్మీర్‌ ప్రజలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటున్నారని,  దీనికోసం ఐరాస చేపట్టబోయే చర్యల కోసం వేచి చూస్తున్నారని వీడియోలో వెల్లడించారు. ఐరాస కార్యకలాపాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని, వాటి తీర్మానాలు, నిర్ణయాలు తప్పుబట్టేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భద్రతా మండలికి అంతర్జాతీయ సహకారం కొరవడుతోందన్నారు.

దీనిపై ఐరాసలోని భారత ప్రతినిధి స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై నిరాధార ఆరోపణలు చేయడం పాక్‌కు రివాజుగా మారిపోయిందని ఐరాసలో భారత కార్యదర్శి విదిష మైత్ర విమర్శించారు. లక్ష్యాలు నిర్దేశించుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడింపించుకోవాలని పాక్‌కు హితవు పలికారు. ప్రతిసారీ జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి భారత అంతర్గత విషయాల్లో పాక్‌ జోక్యం చేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. ‘‘ ఇవాళ పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి చెప్పిందంతా భారత అంతర్గత విషయం. వారి వాదనను భారత్‌ నిర్ద్వందగా ఖండిస్తోంది’’ అని  విదిష మైత్ర స్పష్టం చేశారు.

ఐక్యరాజ్య సమతిలో ఏదైనా పరిష్కారం కాని సమస్యంటూ ఉందంటే అది ఉగ్రవాదమేనని విదిష వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా బుద్ధి రావడం లేదని అన్నారు. ఉగ్రస్థావరాలకు కేంద్ర బిందువగా నిలుస్తూ వారిని పెంచిపోషిస్తోందన్నారు. ఉగ్రవాదులను అమరవీరులుగా పాక్‌ గుర్తిస్తోందని విదిష మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని