ఆ 18 రాష్ట్రాల్లో రికవరీ రేటు 85% పైనే..! 

గత కొన్ని వారాలతో పోల్చి చూస్తే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినట్టే కనబడుతోంది. భారత్‌లో కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతుండటంతో బుధవారం మరో మైలురాయిని ..........

Published : 07 Oct 2020 19:07 IST

జాతీయ సగటు కన్నా అధికం

ఏపీలో 92.2%.. తెలంగాణలో 86.5%

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని వారాలతో పోల్చి చూస్తే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. భారత్‌లో కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతుండటంతో బుధవారం మరో మైలురాయిని చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు ప్రస్తుతం 85.02%గా నమోదైంది. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న వారి సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య 48 లక్షలకు పైనే ఉండటం సానుకూలాంశం. దేశంలో గడిచిన 24 గంటల్లో దాదాపు 12 లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 72 వేల కొత్త పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,57,131కి పెరిగింది. వీరిలో 57,44,693 మంది కోలుకోగా.. 1,04,555 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 9,07,883 క్రియాశీల కేసులు దేశంలో ఉన్నాయి. జాతీయ సగటు రికవరీ రేటు 85శాతం కాగా.. 18 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రేటు 85శాతానికి పైనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,22,71,654 శాంపిల్స్‌ పరీక్షించారు. 

కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌ డయ్యూలో 96.07శాతంగా రికవరీ రేటు ఉండగా.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 94%, బిహార్‌ 93.5%, ఆంధ్రప్రదేశ్‌ 92.2%, తమిళనాడు 91.2%, హరియాణా 90.6%, దిల్లీ 90.4%, ఒడిశా 88.3%, యూపీ 88.1%, పశ్చిమబెంగాల్‌ 88%, ఝార్ఖండ్‌ 87.9%, మిజోరాం 87.8%, పంజాబ్‌ 87%, చండీగఢ్‌ 86.8%, తెలంగాణ 86.5%, గుజరాత్‌ 86.2%, గోవా 85.7%, మధ్యప్రదేశ్‌ 85.1%గా నమోదైంది.  



అలాగే, నిన్న ఒక్కరోజులోనే 72,049 కొత్త కేసులు నమోదవ్వగా.. వాటిలో 78 శాతం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలోనే 12 వేలకు పైగా కొత్త కేసులు రాగా.. కర్ణాటకలో దాదాపు 10వేల కొత్త కేసులు వచ్చాయి. 

ఇక కొవిడ్‌ మరణాల విషయానికి వస్తే నిన్న 986 మంది ప్రాణాలు కోల్పోగా.. 83 శాతం మరణాలు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 370 మంది కొవిడ్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోగా..  కర్ణాటకలో 91మంది మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని