
కొవిడ్ చికిత్సా విధానం.. పునరాలోచనలో భారత్!
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో కేంద్రం నిర్ణయం
దిల్లీ: కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్.. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితుల విషయంలో పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొవిడ్ చికిత్సలో రెమ్‌డిసివిర్ వినియోగంపై భారత్ పునరాలోచనలో పడింది.
దేశంలో కొవిడ్-19 బాధితులకు రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్, రిటోనావిర్ (లోపినావిర్), ఇంటర్‌ఫెరాన్ అనే ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిలో హైడ్రాక్సీ ఔషధాన్ని కొవిడ్ ప్రారంభ దశలో, రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. దేశంలో కొవిడ్ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్‌డెసివిర్ కావడం గమనార్హం.
కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 15న నిర్వహించిన ట్రయల్స్‌లో భారత్ నుంచి 937 మంది పాల్గొన్నారు. దీనిలో పై నాలుగింటిలో రెమ్‌డెసివిర్‌తో సహా ఏ ఔషధం మరణాల రేటును తగ్గించినట్టు కచ్చితంగా వెల్లడి కాలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇక ఇంటర్‌ఫెరాన్, కరోనా రోగులకు హానికరమని తెలిసిందని.. దానితో కరోనా చికిత్సలో దీని వాడకాన్ని నిలిపివేస్తున్నామని వారు వెల్లడించారు.
ఈ ట్రయల్స్ వల్ల కరోనా చికిత్సకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం లభించిందని భారత్‌లో ఈ అధ్యయనాన్ని పర్యవేక్షించిన నిపుణులు తెలిపారు. దేశంలో రికవరీ రేటుకు సంబంధించిన గణాంకాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విధానంపై పునఃసమీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవల నేతృత్వంలో జరిగే కార్యాచరణ (టాస్క్ ఫోర్స్) సమావేశంలో చర్చించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.