
‘మా వృద్ధికి భారతీయ అమెరికన్లే శక్తినిచ్చారు’
డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వృద్ధికి భారత సంతతికి చెందిన అమెరికావాసులు తమ కృషి, వ్యాపార నైపుణ్యాలతో ఎంతో శక్తినిచ్చారని డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ అన్నారు. దేశంలో సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారన్నారు. భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజ్ఞానవంతుల్ని, నైపుణ్యం గల వారికి అవకాశాలు కల్పించే హెచ్-1బీ సహా ఇతర వలస విధానాల్లో నెలకొన్న చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికా వృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్రను ప్రస్తావించిన ఆయన వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్ని నెలకొల్పారన్నారు. సిలికాన్ వ్యాలీకి పునాదులు వేశారన్నారు. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన కీలక కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విరుచుకుపడ్డారు. హెచ్-1బీ వీసా, జాత్యహంకారం, వాతావరణ మార్పుల వంటి అంశాల్లో ట్రంప్ వ్యవహరించిన తీరు పరిస్థితుల్ని మరింత దిగజార్చిందన్నారు. దీంతో దేశంలోకి వలస వచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుందో అని ఆందోళన చెందుతున్నారన్నారు.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. మహమ్మారిని రూపుమాపి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామన్నారు. ప్రతిఒక్కరికీ విద్య, వైద్యం అందేలా చూస్తామన్నారు. అమెరికా విలువలు ఇనుమడింపజేసేలా వలస విధానాన్ని రూపొందించి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదుతామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.