జాదవ్‌ కేసులో భారత్ న్యాయవాదిపై సందిగ్ధం

గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.....

Published : 20 Aug 2020 23:51 IST

దిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ‘‘దౌత్యపరంగా  పాకిస్థాన్‌తో మేం చర్చిస్తున్నాం. అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) తీర్పుకు లోబడి న్యాయమైన విచారణ జరుగుతుందని నమ్ముతున్నాం. అలానే జాదవ్ తరఫున భారత న్యాయవాది వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరాం. పాకిస్థాన్‌ ఇందుకు అవసరమైన పత్రాలను అందిచడంతో పాటు, దౌత్యసాయం అనుమతికి ఎలాంటి ఆటంకాలు కలిగించదని భావిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

గూఢచర్యం ఆరోపణలతో 2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను పాక్‌ ఏజెంట్లు అపహరించారు. బయటికి మాత్రం ఆయనను బలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో 2017లో పాక్‌ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను రద్దు చేయాలని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే మరణశిక్షపై స్టే విధించింది.  ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే కేసును పునఃసమీక్షించి, సరైన సాక్ష్యాధారాలు సమర్పించే వరకు ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు 2019 జులైలో తీర్పు వెలువరించింది. ఐసీజే తీర్పును అసుసరించి పాక్‌ ప్రభుత్వం సివిల్‌ కోర్టులో పునఃసమీక్షించే విధంగా ఆర్డినెస్స్‌ తీసుకొచ్చింది. దీని ఆధారంగా జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించుకునే అవకాశం భారత్‌కు లభించింది. పాక్‌ మాత్రం పాకిస్థాన్‌లో లా ప్రాక్టీస్‌ చేసిన వ్యక్తిని మాత్రమే నియమించుకోవాలని తెలిపింది. అయితే భారత్‌కు చెందిన వ్యక్తిని నియమించుకునేందుకు అనుమతించాలి భారత్ పాక్‌ను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు