చైనా చీమలు కదలినా తెలిసేలా ఉపగ్రహ నిఘా!

దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్‌పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది...

Updated : 06 Aug 2020 20:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దురహంకారపూరిత చైనా కుయుక్తులకు పైఎత్తులు వేసేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్‌పై పటిష్ఠ నిఘా పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 4-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తే బాగుంటుందని యోచిస్తోంది. 4000 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లోని కొండలు, లోయల్లో కమ్యూనిస్టు చైనా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేసినా తెలిసిపోయేలా చర్యలు చేపట్టాలన్నది సైన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది.

రెండుదేశాల సరిహద్దుల్లోని భారత్‌కు చెందిన కొన్ని భూభాగాలని చైనా తమదిగా చెప్పుకొనే సంగతి తెలిసిందే. పదేపదే ఆ దేశ సైనికులు భారత్‌ వైపు వస్తుంటారు. కొన్నాళ్ల క్రితం జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో చైనా దాదాపు 40వేల మంది సైనికులు, భారీ స్థాయిలో ఆయుధాలు, యుద్ధ సామగ్రిని మోహరించింది. అక్కడి నుంచి భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాల్లో శిబిరాలు వేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ఘటనలు ముందే తెలియాలంటే ఉపగ్రహ నిఘా అవసరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

‘భారత, శత్రుదేశ సరిహద్దు ప్రాంతాల్లోని లోయల్లో చైనా సైనికుల కదలికలు మరింత విస్పష్టంగా తెలియాలంటే మనకు కచ్చితంగా 4-6 ఉపగ్రహాలు అవసరం. వీటికి హై రిజల్యూషన్‌ సెన్సార్లు, కెమెరాలు ఉండాలి. చీమ కదిలినా మనకు తెలియాలి’ అని సైనిక వర్గాలు అన్నట్టు తెలిసింది. జూన్‌ నెలలో గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగాయి. దాదాపుగా యుద్ధఛాయలు కనిపించాయి. ప్రస్తుతం సైనిక, దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ పాంగాంగ్‌ సరస్సు, గోగ్రా, ఫింగర్‌ ఫోర్‌ ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పంపించేందుకు చైనా మొండికేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని