
భారత్, పాక్ మధ్య చర్చలు జరగాలి
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలన్న మెహబూబా ముఫ్తీ
దిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు అవసరమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సూచించారు. ఇరు దేశాల నేతలు చర్చించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం సరిహద్దుల వెంట కాల్పుల అనంతరం మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎల్ఓసీ వెంట జరిగిన కాల్పుల్లో ఇరుదేశాల సైనికులు మృతిచెందడం బాధాకరం. వాజ్పేయీ, ముషారఫ్ కాలంలో అమలు చేసిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు ఇరు దేశాల నేతలు చర్చల్లో పాల్గొనాలి’ అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
భారత్-పాక్ సరిహద్దుల్లో శుక్రవారం భారత జవానులు, పాక్ సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు, మరో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఎదురు దాడి జరిపి 8 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు సైన్యాధికారులు వెల్లడించారు. 12 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు. దాయాది దేశానికి చెందిన పలు యుద్ధ బంకర్లను, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైనిక వర్గాలు ప్రకటించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.