భారత్‌లో కరోనా@మరణాల గ్రాఫ్‌ తగ్గుతోందిలా..

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 53,601 పాజిటివ్‌ .....

Published : 12 Aug 2020 02:16 IST

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ రికవరీ రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 53,601 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 47,746 మంది కోలుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారి మరణాల రేటు 2శాతం కంటే తక్కువగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. జూన్‌ మాసంలో 3.3.శాతంగా ఉన్న మరణాల రేటు.. ప్రస్తుతం 1.99%కి పడిపోయిందని తెలిపారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి, 10 రాష్ట్రాల్లో కరోనాపై సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌  తదితర అంశాలపై ఆయన  మీడియాతో మాట్లాడారు. 

ప్రతి మిలియన్‌ జనాభాకు 18320 పరీక్షలు చేస్తున్నట్టు రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. జాతీయ సగటు కంటే 24రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి మిలియన్‌ జనాభాకు నిర్వహించే పరీక్షల సంఖ్య మెరుగ్గా ఉందన్నారు.  ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 15,83,489 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపారు. ఆగస్టు 10న దేశంలోనే అత్యధికంగా 54,859మంది రికవరీ అయ్యారనీ.. ఇప్పటివరకు ఇదే రికార్డు అని గుర్తు చేసుకున్నారు. రికవరీ రేటు, యాక్టివ్‌ కేసుల మధ్య వ్యత్యాసం పెరుగుతోందన్న ఆయన.. క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ సమర్థంగా అమలుచేయడం వల్లే దేశంలో రికవరీ రేటు దాదాపు 70శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా రోగులకు సకాలంలో చికిత్స అందించిన ఫలితంగానే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 1.99శాతంగా ఉన్నట్టు చెప్పారు. 

కరోనాపై తొలి వ్యాక్సిన్‌ను రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాజేశ్‌ భూషణ్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ సంబంధిత వ్యవహారాల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఆ బృందం  రేపు సమావేశం కానుందని చెప్పారు. వ్యాక్సిన్‌ పొందేందుకు రష్యాతో కేంద్రం ఒప్పందం ఏదైనా కుదుర్చుకోవాలని యోచిస్తోందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా స్పందించారు.  10 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మోదీ.. బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణలలో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందువల్ల టెస్టులు పెంచుకోవాలని సూచించారని చెప్పారు. 

2.5కోట్లకు పైగా పరీక్షలు..
దేశంలో కరోనా టెస్టింగ్‌ సామర్థ్యం రోజురోజుకీ పెరుగుతోంది.  ఈ నెల 8న ఒక్కరోజే అత్యధికంగా 7,19,361 శాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం మాత్రం 6,98,290 శాంపిల్స్‌ పరీక్షించామనీ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,52,81,848 టెస్టులు నిర్వహించినట్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని