రక్షణ శాఖలో స్వావలంబన అందుకే: ప్రధాని

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశం స్వావలంబన సాధించడమే కాకుండా దేశ సామర్థ్యాన్ని పెంచడం, ప్రపంచ శాంతికి కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే...

Published : 27 Aug 2020 20:27 IST

దిల్లీ: ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశం స్వావలంబన సాధించడమే కాకుండా దేశ సామర్థ్యాన్ని పెంచడం, ప్రపంచ శాంతికి కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరత్వంలో ఉంచడంలో భాగస్వామి కావడం దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ప్రధాని మోదీ గురువారం మాట్లాడారు.

రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తే హిందూ మహా సముద్రంలో భద్రత పటిష్ఠమవుతుందన్నారు. అలాగే స్నేహపూర్వకంగా మెలిగే దేశాలకు డిఫెన్స్‌ ఉత్పత్తుల ఎగుమతిదారుగా దేశం అవతరించేందుకు దోహదపడుతుందన్నారు. దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకే రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని ఉత్పత్తులను ఈ జాబితాలో చేరుస్తామని మోదీ తెలిపారు.

ఇన్నాళ్లు ప్రపంచంలో అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా భారత్‌ ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశీయ ఉత్పత్తి దిశగా ఆలోచన చేయలేదని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వ హయాంలో దేశీయ తయారీని పెంచడంతోపాటు, ప్రైవేటు రంగం ద్వారా ఈ రంగానికి కొత్త సాంకేతికతను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందుకే రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో 74 శాతం ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌ పద్ధతిలో అనుమతించామని వివరించారు. మరిన్ని సంస్కరణలు కొనసాగుతాయని చెప్పారు. యూపీ, తమిళనాడులో డిఫెన్స్‌ కారిడార్‌ నిర్మాణం వేగంగా జరుగుతోందని, రాబోయే ఐదేళ్లలో ₹20వేల కోట్లను ఇందుకోసం వెచ్చించనున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని