Published : 12 Oct 2020 19:26 IST

పశ్చిమ బెంగాల్‌లో సామాజిక వ్యాప్తి..!

గాలి ద్వారా వ్యాపిస్తోందన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

కోల్‌కతా: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశలో ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పండగ సీజన్‌ దగ్గరపడడంతో రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె బెంగాల్‌ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కరోనావైరస్‌ తీవ్రతపై నేడు మంత్రివర్గం సమావేశమై సమీక్షించింది. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి దశలో ఉన్నట్లు తెలుస్తోంది, అంతేకాకుండా గాలి ద్వారా కూడా వైరస్‌ వ్యాపిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ప్రతిఒక్కరు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంతవరకు షాపింగ్‌ కోసం బయటకు రావద్దని సూచించారు. దుర్గా పూజ మండపాల వద్ద కూడా ప్రజలు తప్పకుండా నిబంధనలు పాటించాలని మమతా బెనర్జీ ప్రజలను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్గా పూజకోసం భారీ స్థాయిలో మండపాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండపాల నిర్వహకులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే సూచనలిచ్చారు.

బెంగాల్‌ పోలీసుల సమాచారం ప్రకారం, కేవలం ఒక్క కోల్‌కతాలోనే 2500 దుర్గాపూజ మండపాలను ఏర్పాటు చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34వేల మండపాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 2లక్షల 88వేల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 5622మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts