
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర
హెచ్చరించిన నిఘా వర్గాలు
దిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు ఐఎస్ఐతో కలిసి జైష్ ఏ మహ్మద్ సంస్థ పన్నాగం పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు పథకం రూపొందించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే సంస్థ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. మసూద్ అజార్ సోదరుడు ముఫ్తీ రౌఫ్ అజ్గర్, షకీల్ అహ్మద్ ఆగస్టు 20న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఐఎస్ఐ అధికారులతో సమావేశమైనట్లు నిఘావర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమావేశంలో రౌఫ్ సోదరుడు మౌలానా అమ్మార్ కూడా ఉన్నారని నిర్ధారించాయి. ఉగ్రవాద దాడి ప్రణాళిక అంతా ఇస్లామాబాద్‌లోని మర్కజ్లో జరిగిందని.. దీనిలో జైషే ఉగ్రవాదులు ముఫ్తీ అజ్గర్ ఖాన్ కాశ్మీరీ, క్వారీ జారార్‌లతో రౌఫ్ పాలుపంచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.