నకిలీ వ్యాక్సిన్లు రావొచ్చు.. జాగ్రత్త!

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఇంటర్‌పోల్‌ కీలక హెచ్చరికలు చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై నేరగాళ్లు గురిపెట్టే ప్రమాదం ఉందని..

Published : 02 Dec 2020 17:24 IST

హెచ్చరించిన ఇంటర్‌పోల్‌

పారిస్‌: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళ ఇంటర్‌పోల్‌ కీలక హెచ్చరికలు చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై నేరగాళ్లు గురిపెట్టే ప్రమాదం ఉందని.. నకిలీ టీకాలు విక్రయించే అవకాశం లేకపోలేదని గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు 194 సభ్య దేశాలను అప్రమత్తం చేస్తూ గ్లోబల్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

‘ప్రస్తుతం చాలా దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని క్రిమినల్‌ సంస్థలు చొరబాట్లకు పాల్పడి వ్యాక్సిన్‌ సరఫరాకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్లతో ప్రజలకు చేరువై వారి ఆరోగ్యం, ప్రాణాలను ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నాయి. ఈ నేరగాళ్లు నకిలీ టీకాలను తయారుచేసి విక్రయించే ప్రమాదం కూడా ఉంది’ ఇంటర్‌పోల్‌ సెక్రటరీ జనరల్‌ జుర్గెన్‌ స్టాక్ వెల్లడించారు. ఇలాంటి నేరగాళ్ల ముఠాల పట్ల అన్ని ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాకు తొలి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేస్తూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి ప్రాధాన్యం కింద సంరక్షణ కేంద్రాల్లో ఉండే వృద్ధులు, వారిని చూసుకునే సిబ్బంది, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్లు యూకే వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని