అందుకు భారతీయులు నన్ను క్షమించాలి

భారతీయుల మనోభావాలు కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్‌ క్షమాపణలు చెప్పారు....

Published : 29 Jul 2020 00:54 IST

ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడి క్షమాపణలు

దిల్లీ: భారతీయుల మనోభావాలు కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్‌ క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్‌ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో హిందువుల ఆరాధ్య దైవం దుర్గాదేవిని పోలి ఉండటంతో పలువురు భారతీయ హిందువులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో యాయిర్‌ సదరు ట్వీట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరారు. ‘‘ నేను ఇజ్రాయెల్‌లోని రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఒక ఫొటోను ట్వీట్ చేశాను. అయితే అది భారతీయుల ఆరాధ్య దైవం దుర్గా మాత అనే విషయం నాకు తెలియదు. పలువురు భారతీయ మిత్రులు ఈ విషయాన్ని నా దృష్టికి తేవడంతో నేను వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాను. ఇందుకు భారతీయ హిందువులు అంతా నన్ను క్షమించాలి’’ అని ట్వీట్ చేశారు.

ఆదివారం దుర్గాదేవి ఫొటోలో ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్‌ మాండెల్బిట్ ముఖాన్ని ఉంచుతూ ‘‘నీచమైన వ్యక్తులు మీ స్థానాన్ని తెలుసుకోండి’’ అంటూ యాయిర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన షేర్ చేసిన ఫొటోపై విమర్శలు రావడంతో దానిని తొలగిస్తూ క్షమాపణలు చెప్పారు. గతంలో కూడా యాయిర్ ఒక జర్నలిస్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. అయితే బెంజమిన్‌ నెతన్యాహు నమ్మకద్రోహం, లంచం తీసుకొన్నారన్న ఆరోపణలతో ఆయనపై మేలో జెరూసలేం కోర్టు విచారణ ప్రారంభమైంది. తనపై వస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవి, కుట్రపన్ని తనను ఇందులో ఇరికించారని నెతన్యాహు ఆరోపించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని