వ్యాక్సిన్‌ కచ్చితమైందైతేనే రష్యాతో చర్చలు!

కరోనాతో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో రష్యా ప్రకటించిన తొలి వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూకడుతున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన .......

Published : 13 Aug 2020 02:23 IST

ఇజ్రాయెల్‌ ఆరోగ్యమంత్రి 

జెరూసలేం: కరోనాతో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో రష్యా ప్రకటించిన తొలి వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకా కోసం లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా, ఆసియాలోని 20 దేశాల నుంచి విజ్ఞప్తి వచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్‌ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ వెల్లడించని విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ మంత్రి యులి ఎడెల్‌స్టైన్ విలేకర్లతో మాట్లాడుతూ.. రష్యా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్‌ను పరిశీలిస్తామన్నారు. అది కచ్చితమైన ఉత్పత్తి అని నిర్ధారణకు వచ్చేకే దాన్ని కొనుగోలు చేసే అంశంపై రష్యాతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.  

టీకాను అభివృద్ధి చేసింది ఏ దేశమనే అంశంతో సంబంధం లేకుండా ప్రతి రిపోర్టునూ ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిపై రష్యా పరిశోధనా సెంటర్‌ నుంచి వచ్చిన నివేదికలపైనా తాము చర్చించామని వెల్లడించారు. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కచ్చితమైన ఉత్పత్తి అని తమకు నమ్మకం కుదిరితే సంప్రదింపులు కూడా జరిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు, సొంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌.. అక్టోబర్‌ నాటికి హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభించే దిశగా ముందుకెళ్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని