JK: విద్యుత్‌, నీటి బిల్లుల్లో 50% రాయితీ

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కొవిడ్‌-19, ఇతర కారణాల వల్ల కుంటుపడిన పర్యాటకం, ఇతర రంగాలను కోలుకునేలా చేసేందుకు రూ.1350 కోట్లతో.........

Updated : 19 Sep 2020 17:53 IST

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వెల్లడి
రూ.1350 కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన 

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కొవిడ్‌-19, ఇతర కారణాల వల్ల కుంటుపడిన పర్యటకం, ఇతర రంగాలను కోలుకునేలా చేసేందుకు రూ.1350 కోట్లతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏడాది పాటు జమ్మూకశ్మీర్‌ ప్రజలందరికీ విద్యుత్‌, నీటి బిల్లుల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది మార్చి వరకు రుణ గ్రహీతలందరికీ స్టాంప్‌ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు 7 శాతం వడ్డీ రాయితీతో క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.2లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లోని కుటుంబాలు, రైతులు,  వ్యాపారులకు ఊరటనిచ్చే లక్ష్యంతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు ఎల్‌జీ మనోజ్‌ సిన్హా ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం సైతం మరో ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందని సంకేతమిచ్చారు. ఈ ప్యాకేజీ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీకి అదనమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని చెప్పారు. తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో ఉద్యోగ కల్పన, వ్యాపారాభివృద్ధి జరిగి  ఆర్థికంగా జమ్మూకశ్మీర్‌ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని ఆశాభావం వ్యక్తంచేశారు. వివిధ రంగాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో ఆగస్టు 18న లెఫ్టినెంట్ గవర్నర్‌ ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. సెప్టెంబర్‌ 1న ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తాజాగా ఈ ప్యాకేజీని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని