India- Japan: భారత్‌లో ₹3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జపాన్‌

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో దాదాపు ఐదు ట్రలియన్‌ యెన్‌లు (సుమారు రూ.3.20లక్షల కోట్లు) జపాన్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అనంతరం ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 20 Mar 2022 12:54 IST

దిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో దాదాపు ఐదు ట్రలియన్‌ యెన్‌లు (సుమారు రూ.3.20లక్షల కోట్లు) జపాన్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా, ప్రధాని మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రెండు రోజుల భారత్​పర్యటనలో భాగంగా 14వ భారత్​- జపాన్​ ద్వైపాక్షిక సదస్సులో ఫుమియో కిషిదా, మోదీ శనివారం భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్​హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయడంతో పాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు వీలుగా ఆరు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.

భేటీ అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్-జపాన్ బంధాలను మరింతగా బలోపేతం అవ్వడం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు. కిషిదా మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర గురించి చర్చించామన్నారు. తూర్పు ఐరోపా దేశానికి వ్యతిరేకంగా రష్యా చర్యలు అంతర్జాతీయ నిబంధనలను కాలరాసేవిగా ఉన్నాయని, ఇది తీవ్రమైన అంశంగా అభివర్ణించారు. ‘జపాన్‌తో ఉన్న స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కిషిదా మధ్య దిల్లీలో ఉత్పాదక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం అంతకముందు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

భారత్​పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.40 గంటలకు భారత్​ చేరుకున్నారు కిషిదా. దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. భారత పర్యటన అనంతరం కంబోడియా వెళ్లనున్నారు. భారతకు వచ్చే ముందు ఉక్రెయిన్​- రష్యా యుద్ధంపై కిషిదా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చర్య ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి సంఘటలను ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని