ఆ జంటకు అదానీ ఫౌండేషన్‌ విమాన టిక్కెట్లు

టీచర్‌ కావాలనే తన భార్య కోరికను నెరవేర్చాలనుకున్న ఓ భర్త గర్భిణిగా ఉన్న ఆమెను 1200 కి.మీల మేర స్కూటర్‌పై తీసుకెళ్లి పరీక్ష రాయించిన స్ఫూర్తిమంతమైన ఘటనపై ...........

Updated : 07 Sep 2020 22:57 IST

భోపాల్‌: టీచర్‌ కావాలనే తన భార్య కోరికను నెరవేర్చాలనుకున్న ఓ భర్త గర్భిణిగా ఉన్న ఆమెను 1200 కి.మీల మేర స్కూటర్‌పై తీసుకెళ్లి పరీక్ష రాయించిన ఘటనపై అదానీ ఫౌండేషన్‌ స్పందించింది. ఆ దంపతులు స్వరాష్ట్రమైన ఝార్ఖండ్‌కు సౌకర్యంగా తిరుగు పయనమయ్యేలా విమాన టిక్కెట్లను అందించి వారి సాహసాన్ని మెచ్చుకుంది. ఈ సందర్భంగా అదానీ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతీ అదానీ ట్విటర్‌లో స్పందించారు. ఈ దంపతుల ప్రయాణం పట్టుదల, ఆశయాలతో కూడుకున్నదని ప్రశంసించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు.  

ధనుంజయ్‌ కుమార్‌ (27), అతడి భార్య సోనీ హెంబ్రామ్‌ ఝార్ఖండ్‌లోని గొడ్డ జిల్లా గంటతోల గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సోనీకి ఉపాధ్యాయురాలు కావాలనేది కోరిక. అయితే, ఇందుకోసం ఆమె డీఎడ్‌ పరీక్షను రాయాల్సి ఉంది. పరీక్ష కేంద్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉంది. ఎనిమిదో తరగతి వరకే చదువుకున్న ధనుంజయ్‌ కుమార్‌ తన భార్య ఉపాధ్యాయురాలు రావాలనే కోరికను ప్రేరణగా తీసుకున్నాడు. ఎలాగైనా పరీక్ష రాయించాలనే సంకల్పంతో గర్భిణిగా ఉన్న సోనీని స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని ఏకంగా 1200 కి.మీల వరకు తీసుకెళ్లి పరీక్ష రాయించాడు. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఓ వైపు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు మరోవైపు ఇబ్బంది పెట్టినా ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్ష రాయించాడు. ఈ కథనాలు మీడియాలో రావడంతో అదానీ ఫౌండేషన్‌ స్పందించి తమకు విమాన టిక్కెట్లు బుక్‌ చేసిందని ధనుంజయ్‌ కుమార్‌ ఆదివారం వెల్లడించాడు. తాము ఎప్పుడూ విమానం ఎక్కలేదని, తమకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు.

ఇదీ చదవండి..

పరీక్ష కోసం.. ఆ గర్భిణి 1200 కిలో మీటర్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని