బహిరంగంగానే టీకా తీసుకుంటా! బైడెన్‌

అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా బహిరంగంగానే టీకా తీసుకునేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

Published : 04 Dec 2020 17:16 IST

వాషింగ్టన్‌: దాదాపు ఏడాది కాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద కొన్నిదేశాలు వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ప్రజలకు భరోసా కలిగించేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్‌, క్లింటన్‌ వంటి నేతలు తాము బహిరంగంగానే టీకా వేయించుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా బహిరంగంగానే టీకా తీసుకునేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

వ్యాక్సిన్‌ల సమర్థతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న ఆయన, వ్యాక్సిన్‌ తీసుకోవడం అనేది సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ఎన్నికల్లో ఓటమిని ఇప్పటివరకూ ఒప్పుకోని డొనాల్డ్‌ ట్రంప్,‌ వచ్చే నెల జరగబోయే బైడెన్‌ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత గందరగోళానికి తెరతీయడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ముఖ్యమని జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, అమెరికాలో కరోనా తీవ్రత నానాటికి పెరిగిపోతూనే ఉంది. నిత్యం దాదాపు రెండు లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడుతుండడంతో పాటు 2వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 2,73,000కు చేరింది. వచ్చే రెండు నెలల్లో మరో 2లక్షల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు అమెరికా ఆరోగ్యశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి అమెరికా అధికారులు కృషి చేస్తున్నారు.

ఇవీ చదవండి..
ఓటమిని అంగీకరించేందుకు సిద్ధం..! ట్రంప్‌
‘మేడిన్‌ చైనా’ ఓ హెచ్చరిక నినాదం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని