కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకి కరోనా

రోజు రోజుకి కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా కరోనా బారిన పడ్డారు....

Published : 10 Aug 2020 02:11 IST

బెంగళూరు: రోజు రోజుకి కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ఆయన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. తనలో స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ప్రారంభమైన నాటి నుంచి  జిల్లాల్లో పర్యటిస్తూ కరోనా రోగులకు అందుతున్న చికిత్సలు, సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఈ క్రమంలో తనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకొని, హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. అయితే కొద్ది రోజుల క్రితం కరోనా నుంచి దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్యానికి స్పందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్క రోజే రాష్ట్రంలో 7,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,72,102 మంది కరోనా బారిన పడ్డారు. వీరితో 89,238 మంది డిశ్చార్జ్‌ కాగా, 3,091 మంది మృత్యువాతపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని