Updated : 07/12/2020 11:19 IST

రైతుల వద్దకు కేజ్రీవాల్‌!

ఏర్పాట్లను సమీక్షించిన దిల్లీ సీఎం

దిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన 12వ రోజూ కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సింఘు ప్రాంతాన్ని సందర్శించారు. గత కొన్ని రోజులుగా అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా రైతులను పరామర్శించారు. మరోవైపు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతాల్లో అన్నదాతలు తమ ఆందోళనను సోమవారమూ కొనసాగిస్తున్నారు. వారు రాత్రంగా రోడ్డుపైనే నిద్రించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే ఏర్పాట్లు చేసింది.  

మరోవైపు ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్నదాతలకు సంఘీభావంగా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అలాగే సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే రైతులకు బాసటగా నిలిచారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్ని సవాల్‌ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సేవలు అందిస్తానని తెలిపారు. హరియాణాలో భాజపాతో కూడిన అధికార కూటమిలోని జేజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా నిలిచారు. 

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. లండన్‌లో ప్రవాస భారతీయుల్లోని కొన్ని వర్గాలు వాహన ర్యాలీ నిర్వహించాయి. దీంతో నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మరోవైపు లండన్‌లోని హై కమిషన్‌ ముందు కొందరు నిరసన ప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను నిలువరించే క్రమంలో కొంతమందిని అరెస్టు చేశారు.

ఇక నూతన వ్యవసాయ బిల్లుల రద్దే లక్ష్యంగా రైతులు పిలుపునిచ్చిన ‘భారత్‌ బంద్‌’కు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అనేక పార్టీలు, సంఘాలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. తాజాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), ఎన్డీయేలో భాగమైన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. అయితే, మానవతా దృక్పథంగా ‘భారత్‌ బంద్‌’ జరగనున్న డిసెంబరు 8న వివాహా కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుందని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

ఇవీ చదవండి..

బంద్‌కు భారీ మద్దతు

అమెరికాలో సిక్కుల గళం

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని